సమాచార హక్కు చట్టానికి అధికార యంత్రాంగం తూట్లు

‘హమార పైసా హమారా హిసాబ్’ అంటూ రాజస్థాన్ లో పురుడు పోసుకున్న నినాదం మహోద్యమమై సమాచార హక్కు చట్టంగా రూపాంతరం చెంది ప్రస్తుతం దేశవ్యాప్తమైంది. పాలనలో పారదర్శకతను, జవాబుదారీతనంను పెంపొందించడంతో పాటు ప్రజలకు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. గ్రామపంచాయతీ మొదలుకొని పార్లమెంట్ వరకు ఒక్క దరఖాస్తుతో కావాల్సిన సమాచారం పొందే హక్కును కల్పించింది. కానీ అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం, సమాచార కమిషన్ చట్టాన్ని చట్టబండలు చేయడానికి ప్రయత్నిస్తున్నది. పెండింగ్ దరఖాస్తులు, అప్పీళ్లు, ఫిర్యాదులతో సామాన్యుడికి సమాచారం అందడం గగనంగా మారింది. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం సవరణలతో సహ చట్టానికి తూట్లు పొడుస్తుంటే మరోపక్క సమాచార కమిషన్ ఉదాసీన వైఖరి వల్ల చట్ట స్ఫూర్తికి భంగం వాటిల్లుతున్నది. 

సవరణలతో బలహీనపరిచే యత్నం

ప్రభుత్వ పనితీరు సామర్థ్యాన్ని మరింత పెంచడం ద్వారా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడానికి 2005 అక్టోబర్ 12 నుంచి సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు ఇస్తే ప్రజా సమాచార అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని సెక్షన్ 7(1) ప్రకారం 30 రోజుల్లో సమాచారం ఇవ్వాలి. ఒక వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉంటే 48 గంటల్లో సమాచారం ఇవ్వాలని చట్టంలోని నిబంధనలు చెబుతున్నాయి. ఒకవేళ అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురైతే ఆ శాఖలోని సీనియర్ అధికారులకు మొదటి అప్పీల్ చేస్తారు. అక్కడ కూడా స్పందన లేకపోతే సమాచార కమిషన్ కు రెండో అప్పీలు చేసుకుని సమాచారం పొందవచ్చు. 

జీవోలు ఇచ్చి వెనక్కి తగ్గిన సర్కారు

తెలంగాణ ప్రభుత్వం నిరుడు అక్టోబర్ లో విడుదల చేసిన మెమో నంబర్ 3476 ప్రకారం సహ చట్టం కింద ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులకు సమాచారం ఇవ్వాలంటే సదరు ప్రజా సమాచార అధికారి వారి ప్రభుత్వ విభాగానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి లేదా ముఖ్య కార్యదర్శి అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హైకోర్టు ఆ ఉత్తర్వులను నిలిపివేసింది. దీనిపై ఉన్నత న్యాయస్థానం వివరణ కోరడంతో ప్రభుత్వం ఆ ఉత్తర్వులను రద్దు చేసి వాటి స్థానంలో నవంబర్12 న అంతర్గత ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకారం కోరిన సమాచారం తన వద్ద పూర్తిగా లేదని ప్రజా సమాచార అధికారి భావిస్తే ఉన్నతాధికారుల సహకారం తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ రెండు ఉత్తర్వుల్లో కొన్ని పదాలు మారినప్పటికీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం ఒకటే అన్నది స్పష్టమవుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ ప్రభుత్వమైనా ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసిన ఆర్థిక వనరులను, నిధుల వివరాలను పబ్లిక్ డొమైన్ లో అప్​లోడ్ చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం సర్కారు జీవోలను దాస్తూ పారదర్శకతకు తిలోదకాలు ఇస్తున్నది. అలాగే సమాచార హక్కు చట్టం నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర సమాచార కమిషన్ లో11 నుంచి-12 మంది సమాచార కమిషనర్లు పనిచేయాలి. కానీ మన రాష్ట్ర కమిషన్ లో ప్రస్తుతం కేవలం ఆరుగురు సమాచార కమిషనర్లు మాత్రమే ఉన్నారు. మిగతా కమిషనర్లను నియమించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు.

పనితీరు సరిగా లేక.. 

2017 సెప్టెంబర్ లో కొత్తగా తెలంగాణ సమాచార కమిషన్ ఏర్పాటైంది. బదిలీ అయిన పిటిషన్లు 6,825 కలుపుకొని మొత్తం 38 వేల పిటిషన్లు కమిషన్​కు అందగా ఇప్పటివరకు 31 వేల పిటిషన్లను పరిష్కరించామని కమిషన్​ చెబుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో లెక్కలు మరోలా ఉన్నాయి. కొందరు సమాచార కమిషనర్ల షోకాజ్ నోటీసులు, జరిమానాల విషయం చూస్తే అర్థమవుతుంది. 2017 సెప్టెంబర్ నుంచి జూన్ 2022 వరకు సమాచార కమిషన్ 27,877 కేసుల్లో 753 కేసులకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వాటిలో కేవలం 38 మంది ప్రజా సమాచార అధికారులపై రూ.1,13,000 జరిమానాలు మాత్రమే విధించారు. ఒక్క కేసులో కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అప్పీళ్లు, ఫిర్యాదులు పరిష్కరించడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుందని ‘సతార్కు నాగరిక్ సంఘటన్’ నిరుడు అక్టోబర్ నెలలో విడుదల చేసిన తన నివేదికలో స్పష్టం చేసింది. కమిషన్ ఏర్పడిన ఈ ఐదేండ్లలో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయిలో సమాచార కమిషన్ ఒక్క సమీక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. చట్టం అమలుకు సంబంధించి కమిషన్ ఏటా వార్షిక నివేదిక విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో మొత్తం కేసులు, పరిష్కరించినవి ,పెండింగ్​లో ఉన్నవి, జరిమానాలు విధించినవి, క్రమశిక్షణ చర్యలు తీసుకున్న విషయాలను ప్రస్తావించాలి. కానీ కమిషన్ ఏర్పడిన ఐదేండ్లలో ఒక్కసారి కూడా వార్షిక నివేదికను విడుదల చేయలేదు.

స్వచ్ఛంద సమాచార వెల్లడి ఎక్కడ? 

సమాచార హక్కు చట్టంలో సెక్షన్ 4(1)బి చట్టానికి గుండెకాయ వంటిది. ఇందులో 17 అంశాలు ఉన్నాయి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని అధికారుల వివరాలు వారి విధులు, నిర్వర్తించాల్సిన బాధ్యతలు, ఆ కార్యాలయానికి వస్తున్న నిధులు, వాటి ఖర్చు వివరాలు వీటన్నిటిని సంబంధిత ప్రభుత్వ యంత్రాంగమే స్వచ్ఛందంగా ప్రజలకు తెలియజేయాలనేది నిబంధన. రాష్ట్రంలో దాఖలవుతున్న దరఖాస్తులు 60 శాతం ఈ సెక్షన్ పరిధిలో సమాచారం కోరుతూ వస్తున్నవే. కానీ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అయిదారేండ్ల కిందటి పాత సమాచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వ శాఖలను ప్రశ్నించాల్సిన సమాచార కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ప్రజా సమాచార అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ కార్యాలయ సమాచారాన్ని సరైన విధంగా డిజిటలైజ్ చేయలేకపోతున్నారు. అన్ని ప్రభుత్వ విభాగాలు తమ బడ్జెట్​లో ఒక శాతాన్ని డిజిటలైజేషన్ తో పాటు, సమాచారం మెరుగ్గా నిర్వహించడానికి వ్యయం చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ దాన్నెవరూ పట్టించుకోవడం లేదు. జాగృత జన వాహిని పిడికిలి బిగించకుంటే సమాచార హక్కుకు గ్రహణం తథ్యం.
- అంకం నరేష్, రాష్ట్ర కో కన్వీనర్, యూఎఫ్​ఆర్టీఐ