ప్రభుత్వం మెడలు వంచైనా.. బీసీల హక్కులు సాధించుకుంటం: బీసీ మేధావుల సదస్సులో వక్తల డిమాండ్

  • ప్రభుత్వం మెడలు వంచైనా.. బీసీల హక్కులు సాధించుకుంటం
  • బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వంరివ్యూ పిటిషన్  వేయాలి
  • బీసీ మేధావుల సదస్సులో వక్తల డిమాండ్

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వాటా సాధించే వరకు దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం మెడలు వంచి అయినా బీసీల హక్కులను పొందుతామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్  వేయాలని బీసీ మేధావుల సదస్సు డిమాండ్  చేసింది. రాష్ట్రం చేపట్టిన సామాజిక, ఆర్థిక కులగణన సర్వేతో వివరాలు అందుబాటులోకి వచ్చినందున ఆ గణాంకాల ఆధారంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్  వేసి బీసీలకు న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని సదస్సు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

శుక్రవారం హైదరాబాద్  కాచిగూడలోని ఓ హోటల్లో బీసీ మేధావుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ  కృష్ణయ్య, శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, బీసీ కమిషన్  మాజీ చైర్మన్  వకుళాభరణం కృష్ణమోహన్ రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. లోకల్  బాడీ ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీసీల ఉపవర్గీకరణ చేసి రిజర్వేషన్లు కల్పించాలని వకుళాభరణం డిమాండ్  చేశారు. ఈ సమావేశంలో 30 బీసీ కుల సంఘాల ప్రతినిధులు, 20 బీసీ సంఘాల నాయకులు, ప్రొఫెసర్లు, సామాజికవేత్తలు, మహిళ, విద్యార్థి, యువజన నాయకులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు.

బీసీలంతా తెగించి పోరాడాలి: ఆర్​. కృష్ణయ్య
బషీర్ బాగ్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు, పార్లమెంట్ లో బిల్లు కోసం బీసీలంతా తెగించి పోరాటం చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. పోరాడితేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి బీసీల సమస్యలను పరిష్కరిస్తాయన్నారు. శుక్రవారం హైదరాబాద్ కాచిగూడలో జరిగిన బీసీ మేధావుల సదస్సులో ఆర్ కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. 78 ఏండ్ల స్వాతంత్ర్య దేశంలో బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీ రిజర్వేషన్ల పెంపుపై చట్టం తీసుకువస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. సమగ్ర సర్వే పూర్తి స్థాయిలో నిర్వహించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలన్నారు. రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే అడ్డుకుంటామని, అవసరమైతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ.. జనాభాలో 56 శాతం ఉన్న బీసీలు ఏ రంగంలో కూడా ముందంజలో లేరన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, కాంగ్రెస్ నాయకుడు కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.