
- బీఆర్ఎస్ నేతలు దోచుకున్న భూములను అసలైన యజమానులకు తిరిగి అప్పగిస్తం
- ‘భూ భారతి’ పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో జూన్ 2కల్లా భూసమస్యలన్నీ పరిష్కరిస్తం
- ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చేస్తం.. ఎలాంటి ఫీజు తీసుకోబోమని వెల్లడి
- నారాయణపేట జిల్లా ఖాజీపూర్‌లో పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్ / మహబూబ్‌నగర్, వెలుగు: ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న పేదల్లో అర్హులైన రైతులకు వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు కబ్జా పెట్టిన ప్రభుత్వ, రైతుల భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని.. వాటిని అసలైన యజమానులకు అప్పగిస్తామని తెలిపారు. కోర్టు వివాదాలు మినహా మిగతా భూసమస్యలన్నీ భూభారతితో పరిష్కరిస్తామని చెప్పారు.
భూభారతి చట్టం పైలెట్ ప్రాజెక్టును గురువారం నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఖాజీపూర్‌లో పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూభారతి చట్టం దేశానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందన్నారు. ధరణి ఉన్నప్పుడు ప్రజలే అధికారుల చుట్టూ తిరిగారని, కానీ భూభారతి చట్టంతో అధికారులే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకొని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరిస్తారని వెల్లడించారు. అంతేకాకుండా ఇందుకు ఎలాంటి ఫీజు కూడా తీసుకోరని చెప్పారు. ‘‘మే 1వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలకు కలెక్టర్లు వస్తారు.
భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభమైన 4 జిల్లాలు మినహాయించి మిగిలిన 28 జిల్లాల్లోని 28 మండలాల్లోనూ మే ఒకటి లేదా రెండో తారీఖు నుంచి పైలెట్ ప్రాజెక్టులు ప్రారంభిస్తాం. జూన్2కల్లా తొలి 4 జిల్లాల్లోని పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో భూసమస్యలన్నీ పరిష్కరిస్తాం. జూన్2 నుంచి ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారు. ఇందుకు ఎవరూ అప్లికేషన్ ఫీజు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు” అని తెలిపారు.
భూసమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే నా దగ్గరికి వచ్చిన్రు..
ధరణికి, భూభారతి చట్టానికి చాలా తేడాలు ఉన్నాయని పొంగులేటి అన్నారు. కండ్లు మూసుకొని తమకు ఏది కనబడటం లేదని ప్రతిపక్షాలు ఇంకా అబద్ధాలు మాట్లాడుతున్నాయని ఫైర్అయ్యారు. ‘‘ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నా దగ్గరకు వచ్చారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన వారికి ఇంగితజ్ఞానం కూడా లేదు. అసెంబ్లీలో భూభారతి బిల్లు పెడితే, దాన్ని వ్యతిరేకించారు” అని మండిపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు కొందరు వాళ్లకున్న భూసమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఇప్పుడు వాళ్లందరికీ పరిష్కారం లభిస్తుందని చెప్పారు.
భూముల లెక్కలన్నీ తీస్తాం..
పేదలకు భూములను పంచేది ఇందిరమ్మ ప్రభుత్వమేనని పొంగులేటి అన్నారు. పేదలకు ఇచ్చిన భూములను ‘ధరణి’ పేరుతో గత ప్రభుత్వం కొల్లగొట్టిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ ఆడిట్ చేసి ఆ భూములను బయటకు తీస్తామన్నారు. ‘‘ఒక దగ్గర పాస్‌బుక్‌లో తక్కువ భూమి ఉంటే, ఫీల్డ్‌లో ఎక్కువ ఉంటుంది. మరో దగ్గర ఫీల్డ్‌లో తక్కువ ఉంటే, పాస్‌బుక్‌లో ఎక్కువ ఉంటుంది. ఆనాడు ఆఫీసర్లను భయపెట్టి బీఆర్ఎస్ లీడర్లు పాస్‌బుక్‌లో ఎక్కువ విస్తీర్ణం రాయించుకున్నారు. పక్కా పొజిషన్‌లో ఎవరు ఉన్నారు? ఎవరు పేరున ఎంత భూమి ఉందో సర్వే చేస్తాం. ఆ సర్వే ఆధారంగానే పాస్‌బుక్స్ ఇస్తాం. త్వరలో గ్రామ పరిపాలనాధికారులను నియమిస్తామని చెప్పారు. ‘‘భూముల రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత భూమి మ్యాప్‌ను కూడా జత చేసేలా కార్యాచరణ మొదలుపెట్టాం. ఇందుకోసం 6 వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించనున్నాం. మే ఒకటి, రెండు తారీఖుల్లోపు వీళ్లను నియమిస్తాం” అని వెల్లడించారు.
భూమి రిజిస్ట్రేషన్ అయినా పాస్‌బుక్ రాలేదు..
ఒక రైతు నుంచి ఎకరా పొలం కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. కానీ ఆయన చనిపోవడంతో కొడుకు పేరు మీద పాస్‌బుక్ వచ్చింది. నా పేరిట పాస్‌బుక్ ఇవ్వాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ రెండేండ్లుగా తిరుగుతున్నా పని కాలేదు. -శరణప్ప
నా భర్త పేరు మీది భూమి.. నా పేరుమీదకి రాలే
నా భర్త దాసరి బాలకిష్టప్ప చనిపోయి ఐదేండ్లయింది. ఆయన పేరు మీద ఊర్లో 3 ఎకరాల పొలం ఉంది. ఆ భూమి నా పేరు ఇప్పటికీ ఎక్కలే. అది నా పేరు మీద చేయాలని అధికారులకు అప్లికేషన్ రాసిచ్చిన.
-మణెమ్మ
మూడేండ్లుగా విరాసత్ కాలే..
మా నాన్న మైనుద్దీన్ చనిపోయి చాలా ఏండ్లయింది. నాన్న పేరిట ఉన్న ఎకరా భూమి నా పేరిట విరాసత్ చేసుకోవాలని ధరణి ద్వారా దరఖాస్తు చేసుకున్నాను. మూడేండ్లుగా మద్దూరు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా ఇప్పటికీ విరాసత్ కాలేదు.
– ఎండీ రహీం