తెగిపోయిన యన్మన్ గండ్ల పెద్ద చెరువు రిండ్ బండ్

తెగిపోయిన యన్మన్ గండ్ల పెద్ద చెరువు రిండ్ బండ్
  • ఐదు గ్రామాల్లో యాసంగి సాగు లేనట్లే..
  • సెజ్​కంపెనీల్లో కూలీకి వెళ్తున్న బాధిత రైతులు

మహబూబ్​నగర్​, వెలుగు : నాసికరం పనుల కారణంగా మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా నవాబు పేట మండలంలోని యన్మన్‌‌ గండ్ల చెరువు కట్టకు మళ్లీ గండి పండింది.  ఇప్పటికే ఓ సారి చెరువు తెగి దిగువన ఉన్న రైతులు పంటలు నష్టపోయారు.  తాజాగా పడిన గండితో మరోసారి నష్టం తప్పట్లేదు.  యన్మన్​గండ్ల పెద్ద చెరువు కింద చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూరు, రుక్కంపల్లి, నవాబ్​పేట, యన్మన్​గండ్ల గ్రామాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల ఆయకట్టు ఉంది.  ప్రధాన పంటగా రైతులు వరి సాగు చేస్తున్నారు.  ఈ ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి భారీగా వరద రావడంతో కట్టకు గండి పడింది.  దీంతో చెరువు కింద  290 ఎకరాల్లో వరి, 30 ఎకరాల్లో మక్క  పంట నాశనం అయ్యింది.  చెరువుకు దగ్గర్లో ఉన్న 180 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి.  

రూ.5 లక్షలతో తాత్కాలిక పనులు 

దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఇరిగేషన్ ఆఫీసర్లు యాసంగి సాగును దృష్టిలో పెట్టుకొని గండి పండిన చోట  అదేనెల 29న రింగ్​బండ్​ వేసేందుకు రూ.5 లక్షలతో తాత్కాలిక పనులకు టెండర్‌‌‌‌ పిలిచారు.  టెండర్‌‌‌‌ దక్కించుకున్న ఓ కంపెనీ ఈ పనులు చేపట్టింది. అయితే నాసిరకంగా పనులు చేసినట్లు  ఆరోపణలు ఉన్నాయి.  ఆరు ఫీట్ల వరకు రింగ్​బండ్​ వేయాల్సి ఉండగా.. నాలుగు ఫీట్ల వరకే వేసి వదిలేసినట్లు రైతులు చెబుతున్నారు.  ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న కుంటల నుంచి చెరువుకు వరద పోటెత్తింది.  దీంతో శనివారం తెల్లవారుజామున మళ్లీ గండి పడి దిగువన పొల్లాల్లోకి  నీరు, బురద వచ్చి చేరింది. 

రెండు నెలలైనా పరిహారం ఊసేలేదు

ఆగస్టు 8న చెరువుకు గండి పడటంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అధికార పార్టీ లీడర్లు, ఆఫీసర్లు హామీ ఇచ్చారు. ఈ మేరకు పంటలను పరిశీలించి రిపోర్ట్​ ఇవ్వాలని అగ్రికల్చర్​ ఆఫీసర్లను ఆదేశించారు.  పంట నష్టంతో పాటు పొలాల్లో ఇసుక మేటలు వేసి బోర్లు దెబ్బతిన్నాయని, ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని  రైతుల డిమాండ్ చేయడంతో ఆఫీసర్లు సర్వే చేసి రిపోర్టు పంపారు.  రెండు నెలలు కావస్తున్నా ఒక్కరికీ కూడా పరిహారం అందలేదు.  చేసేది లేక  రైతులే  సొంత ఖర్చులతో ఇసుక మేటలు వేసుకొని సెప్టెంబర్‌‌‌‌లో మళ్లీ వరి నాట్లు వేసుకున్నారు.  

యాసంగి సాగు లేనట్లే?

యాసంగి సాగుకు ఇక్కడి రైతులకు చెరువు నీరే ఆధారం.  ఆయకట్టుతో పాటు చెరువులో నీళ్లు ఉంటేనే బోర్లు పోస్తాయి. కానీ, ఇప్పుడు గండి పడి చెరువు మొత్తం ఖాళీ కావడంతో రైతులు యాసంగి సాగుపై ఆశలు వదులుకున్నారు. కొన్ని బోర్లులో ఎప్పుటికీ నీళ్లు ఉంటున్నా.. చెరువుకు గండి పండిన టైంలో ఇసుక చేరడంతో అవి పని చేయడం లేదు.  

సెజ్ కంపెనీల్లో కూలీలుగా రైతులు

ఈ సీజన్​ మొదటి నుంచి పంట నష్టపోయిన రైతులు కుటుంబాలను పోషించుకునేందుకు కూలీలుగా మారుతున్నారు. పంటలపై చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు చెన్నారెడ్డిపల్లి, ఇప్పటూరు, రుక్కంపల్లి, నవాబ్​పేట, యన్మన్​గండ్ల గ్రామాల సమీపంలో ఉన్న పోలేపల్లి సెజ్​ కంపెనీల్లో కూలీ పనులకు వెళ్తున్నారు. కంపెనీలు రోజుకు రూ.400 చెల్లిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు.

పర్మనెంట్​ వర్క్​ చేయలేదు

ఆగస్టులో చెరువుకు గండి పండటంతో రూ.5 లక్షలతో తాత్కాలికంగా రింగ్​ బండ్​ పనులు చేసినం. యాసంగి సాగుకు నీళ్లు అందుబాటులో ఉండేట్లు ఈ పనులు చేపట్టినం. పర్మనెంట్​ వర్క్​ చేయలేదు. అయితే, వర్షాలు ఎక్కువ పడటంతో మళ్లీ గండి పడింది. త్వరలో రిపేర్లు చేస్తం.  

సురేశ్​, డీఈఈ, నవాబ్​పేట

రెండు మీటర్లు పెంచమన్నా వినలే

చెరువుకు నాలుగు ఫీట్ల రింగ్​ బండ్​నే వేశారు. ఆరు ఫీట్ల వరకు వేయాలని కోరినా  ఎవరూ మాట ఎవరూ వినలేదు. ఆఫీసర్లు నిర్లక్ష్యం వల్ల మళ్లీ చెరువుకు గండి పడింది. దీంతో దిగువన ఉన్న మా పొలాలు మళ్లీ మునిగినయ్​.  చెరువులో నీళ్లు మొత్తం ఖాళీ అయనవి. ఇప్పుడు  యాసంగి సాగుకు నీళ్లు ఏట్లా? పరిహారం కూడా ఇయ్యలేదు. 

–వెంకటయ్య, బాధిత రైతు, రుక్కంపల్లి