వికారాబాద్, వెలుగు: వికారాబాద్ పట్టణం చుట్టూ త్వరలో రూ. 850 కోట్లతో రింగ్ రోడ్డు రాబోతుందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. వికారాబాద్ కూరగాయల మార్కెట్ లో రూ. 1.14 కోట్లతో కొత్తగా 24 దుకాణాల సముదాయానికి సోమవారం ఆయన భూమి పూజ చేశారు.
వ్యవసాయ మార్కెట్ యార్డులో పనిచేస్తున్న కార్మికులకు ఏక రూప దుస్తులను పంపిణీ చేశారు. కొడంగల్తోసమానంగా వికారాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్కెట్ లో అవసరమైన ఇతర వసతులకు కూడా త్వరలో నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు.
వుడా ఏర్పాటుతో జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిగుళ్లపల్లి మంజుల రమేశ్, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఆర్డీవో వాసుచంద్ర, మార్కెట్ కమిటీ కార్యదర్శి మొఖరం, డీసీసీబీ డైరెక్టర్ కిషన్ నాయక్, మాజీ జడ్పీటీసీ మహిపాల్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డిపాల్గొన్నారు.
మరోవైపు, నియోజకవర్గంలోని మోమిన్ పేట నందివాగు, సర్పన్ పల్లి ప్రాజెక్టుల్లోకి సబ్సిడీ చేప పిల్లలను ఆయన వదిలారు. మత్స్యకారులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని, అవసరమైన చోట మత్స్యకార భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. జిల్లాలోని చెరువుల అభివృద్ధిపై సర్వే చేయించానని, త్వరలోనే అవసరమైన పనులను ప్రారంభిస్తామన్నారు.