ఆస్థి కోసం తండ్రిని ఇంటి నుంచి వెళ్లగొట్టిన కొడుకు.. ఆస్థి రాసివ్వలేదని కన్న తండ్రికి నిప్పంటించిన కొడుకు.. ఇదీ నేటి కాలంలో కొడుకుల తీరు. మా ఆస్థి మాకివ్వు.. వేరే కాపురం పెట్టుకోవాలి అనే వారు కొందరైతే.. ఆస్తుల కోసం అమ్మనాన్నలను అనాధాశ్రమాల్లో చేర్చే వారు మరికొందరు. ఇలాంటి ఘటనలు పత్రికల్లో రోజుకొకటి వస్తున్నాయి. కానీ, ఈ భారత క్రికెటర్ చాలా విభిన్నం. తండ్రికి రూ. 5 లక్షల ఖరీదైన బైక్ కొనిచ్చాడు.
కవాసకి నింజా 400 స్పోర్ట్స్ బైక్
అతనికేం.. భారత క్రికెటర్. ఐపీఎల్ ద్వారా రెండు నెలల్లోనే కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆ మాత్రం కొనివ్వలేడా..! నేనైతే ఏ విమానమో.. ఈ రైలో కొనిచ్చేవాడిని అనకండి. రింకూ సింగ్ అందరి క్రికెటర్లలా కాదు. వచ్చిన డబ్బును ఖాతాల్లో దాచుకోవడమూ లేదు. ఖరీదైన కార్లు, బంగ్లాలు కొనడం లేదు. చేతికొచ్చే రూ.10 కోట్లలో కష్టాల్లో ఉన్నామని అతని వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికి తోచినంత సాయం చేస్తుంటాడు. పేద విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్‌లు పంపిణీ చేస్తుంటాడు. తోబుట్టిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇలా అతను అందరికీ ఆదర్శం.
ALSO READ | IPL 2025: రూ.23 కోట్లు దండగేనా: సొంత లీగ్‌లో ఘోరంగా విఫలమవుతున్న SRH హీరో
ఎంతైనా కుటుంబాన్ని పోషించడానికి తండ్రి పడుతున్న కష్టాలు కళ్లారా చూసి పెరిగిన కొడుకు కదా..! తండ్రికి ఖరీదైన ఓ బహుమతి ఇచ్చాడు. రూ. 5 లక్షలకు పైగా విలువైన కవాసకి నింజా 400 స్పోర్ట్స్ బైక్‌ను తన తండ్రి ఖాంచంద్ సింగ్‌కు తన గుర్తుగా ఇచ్చాడు. ఆ బైక్‌పై తన తండ్రి కూర్చున్నంతసేపు.. రింకూ పక్కనున్నట్టే లెక్కట. బైక్‌ను తండ్రి చేతుల్లో పెట్టే సమయంలో ఈ మాట కూడా చెప్పాడు. రింకూ తండ్రి ఖాంచంద్ సింగ్ బైక్‌పై వెళ్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఎంపీతో రింకూ పెళ్లి
ఇదిలావుంటే, రింకూ సింగ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ ప్రియా సరోజ్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని ప్రియా సరోజ్ తండ్రి, ప్రస్తుత కేరాకట్ నియోజకవర్గం ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ ధ్రువీకరించారు. వీరి పెళ్లి ప్రతిపాదనపై రింకూ సింగ్ కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు, ఇరు కుటుంబాలు అందుకు అంగీకరించినట్లు తెలిపారు.