RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్‌కు రింకూ ఫిదా

RCB vs CSK: ధోనీ, జడేజాలను నిలువరించాడు: యష్ దయాల్ బౌలింగ్‌కు రింకూ ఫిదా

2023 ఐపీఎల్ సీజన్.. గుజరాత్, కోల్ కతా మధ్య మ్యాచ్.. చివరి ఓవర్లో విజయానికి 29 పరుగులు అవసరం.. క్రీజ్ లో రింకూ సింగ్.. యష్ దయాల్ బౌలింగ్.. ఇంకేముంది గుజరాత్ విజయం నల్లేరు మీద నడక అనుకున్నారు. కానీ 5 నిమిషాల్లో మ్యాచ్ స్వరూపమే మార్చేశాడు రింకూ సింగ్. వరుసగా 5 సిక్సులు కొట్టి కేకేఆర్ కు ఊహించని విజయాన్ని అందించాడు. అసాధ్యమనుకున్న మ్యాచ్ ను గెలిపించి గుజరాత్ కు షాక్ ఇచ్చాడు. ఈ మ్యాచ్ తో రింకూ సింగ్ హీరోగా మారితే యష్ దయాల్ పై విమర్శలు గుప్పించారు. 

ఈ మ్యాచ్ తర్వాత దయాల్ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. సొంత జట్టు అతనికి అవకాశాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఈ దశలో ఈ యువ ప్లేయర్ కెరీర్ ముగిసిందనే కామెంట్స్ కూడా వినిపించాయి. 2023 ఐపీఎల్ మినీ వేలంలో దయాల్ కు రూ. 5 కోట్లు పెట్టి రాయల్ ఛాలెంజర్స్ కొనుగోలు చేయడంతో బయట నుంచి విమర్శలు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే యష్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఒక్కసారిగా దయాల్ తనలోని మరో కోణాన్ని చూపించాడు. తనలోని వేరియషన్స్ చూపిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడు. 

ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో చెన్నై ప్లే ఆఫ్ కు క్వాలిఫై కావాలంటే 17 పరుగులు చేయాల్సిన దశలో ధోనీ, జడేజా లాంటి బెస్ట్ ఫినిషర్స్ ను నిలువరించి వావ్ అనిపించాడు. తొలి బంతికే సిక్స్ ధోనీ సిక్స్ కొట్టినా.. ఆ తర్వాత 5 బంతులకు ఒక్క బౌండరీ కూడా ఇవ్వలేదు. దీంతో బెంగళూరు ప్లే కు    
చేరుకుంది. 

ప్రస్తుతం దయాల్ బౌలింగ్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. రింకూ సింగ్ అతని బౌలింగ్ ను ప్రశంసించడం వైరల్ గా మారింది. తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో "గాడ్స్ ప్లాన్ బేబీ" అని రాస్తూ అతన్ని అభినందించాడు. దయాల్ బౌలింగ్ లో రింకూ 2023 సీజన్ లో వరుసగా 5 సిక్సులు కొట్టి మ్యాచ్ గెలిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌‌లో బెంగళూరు 27 రన్స్ తేడాతో సీఎస్కేను ఓడించింది.