యూకేలో అల్లర్లు.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న హైకమిషన్

యూకేలో అల్లర్లు.. భారతీయులు అప్రమత్తంగా ఉండాలన్న హైకమిషన్

యూకేలోని పలు ప్రాంతాల్లో వలస వ్యతిరేక గ్రూపులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల క్రితం ఓ హోటల్‌లో బస చేస్తున్న శరణార్థులపై దాడిచేసిన ఘటన తాజా ఉద్రిక్తతలకు దారితీసింది. ఓ డ్యాన్స్‌ క్లాస్‌పై దాడి చేసిన దుండగులు చిన్నారులపై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతిచెందడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమైంది. దాడికి పాల్పడిన దుండుగుడు వలసవాదిగా అనుమానిస్తున్న వలస వ్యతిరేకులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారతీయులను ఉద్దేశించి అక్కడి హైకమిషన్ పలు సూచనలు చేసింది. 

యూకేలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అక్కడి హైకమిషన్ హెచ్చరించింది. అల్లర్లను హైకమిషన్ నిశితంగా గమనిస్తోందని వెల్లడించింది. ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు ఎవరూ వెళ్లొద్దని సూచించింది. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలని తెలిపింది. అందరికీ అందుబాటులో ఉండేలా ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్(+44 (0) 20 7836 9147) ఏర్పాటు చేసింది. ఎవరైనా సహాయం కావాలంటే, ఈ నెంబర్‌లో సంప్రదించాలని సూచించింది. అలాగే, యూకే వెళ్లే భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత విదేశాంగ శాఖ సూచనలు చేసింది.