నారాయణపేట మున్సిపాలిటీలో లుకలుకలు

నారాయణపేట మున్సిపాలిటీలో లుకలుకలు
  • చైర్​పర్సన్​పై అసంతృప్తితో కౌన్సిల్​ మీటింగ్​ బాయ్​కాట్!
  • కోరం లేదనే పేరుతో మీటింగ్​ వాయిదా
  • అవిశ్వాసం పెడతారనే ప్రచారం

నారాయణపేట, వెలుగు: నారాయణపేట మున్సిపాలిటీలో లుకలుకల ప్రారంభమయ్యాయి. సోమవారం జరగాల్సిన బడ్జెట్​ సమావేశానికి బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు డుమ్మా కొట్టారు. దీంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు మున్సిపల్​ కమిషనర్​ ప్రకటించారు. ఇదిలాఉంటే చైర్​పర్సన్​ గందె అనుసూయపై అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు కావాలనే సమావేశానికి హాజరు కాలేదని అంటుండగా, మరోవైపు ఆమెపై అవిశ్వాసం పెడతారనే ప్రచారం జరుగుతోంది. 

24 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్​కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు, చైర్​పర్సన్​తో పాటు మరో బీఆర్ఎస్​ కౌన్సిలర్​హాజరు కాగా, మిగిలిన 19 మంది గైర్హాజరయ్యారు. బీఆర్ఎస్​ కౌన్సిలర్లు మున్సిపాలిటీ వరకు వచ్చినప్పటికీ మీటింగ్​లో పాల్గొనకుండా వెళ్లిపోయారు.

చైర్​పర్సన్​పై గుస్సాతో..

తమ పార్టీకే చెందిన చైర్​పర్సన్​ ఉన్నప్పటికీ తమ వార్డులను అభివృద్ధి చేయడం లేదని, మున్సిపాలిటీలో పెత్తనం చెలాయిస్తున్నారని గత కొన్నాళ్లుగా కౌన్సిలర్లు చెబుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చైర్​పర్సన్​పై అసంతృప్తి చేయిదాటిపోవడంతో, అప్పటి  ఎమ్మెల్యే సయోధ్య కుదిర్చినట్లు ఆపార్టీ వర్గాలే చెబుతున్నాయి. అయినా పరిస్థితి మారకపోవటంతో వైస్​ చైర్మన్​ తన పదవికి రాజీనామా చేస్తానని, తన వార్డును ప్రతిపక్ష సభ్యుల కంటే హీనంగా చూస్తున్నారని బహిరంగంగానే చెప్పారు. వైస్​చైర్మన్​ను పిలిపించి మాట్లాడాలని ఆ పార్టీ​కౌన్సిలర్లు చైర్​పర్సన్​తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే చైర్​పర్సన్​ వాయిదా వేస్తూ వచ్చారని, దీంతో వైస్​చైర్మన్​ బడ్జెట్​ సమావేశానికి రాకపోవడంతో పాటు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు సమావేశానికి డుమ్మా కొట్టారని ఓ కౌన్సిలర్​ తెలిపారు.

బీఆర్ఎస్​కు బీజేపీ కౌన్సిలర్ల సపోర్ట్..

బీఆర్ఎస్​ పార్టీలో లుకలుకలు నడుస్తుండగా బీజేపీ కౌన్సిలర్లు అసమ్మతి వర్గానికి సపోర్ట్​ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్​ సమావేశానికి బీఆర్ఎస్​ కౌన్సిలర్లతో పాటు బీజేపీ కౌన్సిలర్లు ఎందుకు రాలేదనే విషయం చర్చనీయాంశంగా మారింది. చైర్​పర్సన్​ను దింపడానికే అందరూ కలిసి ప్లాన్​ చేస్తున్నారని పేర్కొంటున్నారు. 

నాలుగేండ్లుగా తమ వార్డులకు ఫండ్స్​ ఇవ్వలేదని గత సమావేశాల్లోనూ విమర్శించారు. బీఆర్ఎస్​ పార్టీకి చెందిన చైర్​పర్సన్​ను గద్దె దింపేందుకు బీజేపీ కౌన్సిలర్లు సిద్ధమవగా, పార్లమెంట్​ ఎన్నికల ముందు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆ పార్టీ నేత ఒకరు వారించినట్లు సమాచారం. చైర్​పర్సన్​పై బహిరంగంగా వ్యతిరేకత వస్తే అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. 

ఈ విషయమై చైర్​పర్సన్​ గందె అనసూయను సంప్రదించగా, తమ పార్టీ కౌన్సిలర్లు ఫంక్షన్లు, జాతర ఉందని వెళ్లారని తెలిపారు. 3 రోజుల కిందే సమవేశం ఉందని కౌన్సిలర్లకు సమాచారం ఇచ్చినా ఎందుకు గైర్హాజరయ్యారో తెలియదన్నారు.  పార్టీ కౌన్సిలర్లకు ఫంక్షన్లు ముఖ్యమా. ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన సమావేశాలు ముఖ్యమా అని ప్రశ్నించగా  సమాధానం చెప్పలేదు. 

ALSO READ : రేవంత్​రెడ్డిని చూసి కేసీఆర్ భయపడుతుండు : వంశీ కృష్ణ

చైర్మన్, వైస్ చైర్మన్ పై అవిశ్వాసం
 

వనపర్తి: బీఆర్ఎస్​ పార్టీకి చెందిన వనపర్తి మున్సిపల్​ చైర్మన్  గట్టు యాదవ్, వైస్ చైర్మన్  వాకిటి శ్రీధర్ పై సోమవారం పలువురు కౌన్సిలర్లు కలెక్టర్  తేజస్  నందలాల్  పవార్ కు అవిశ్వాసం నోటీస్ అందజేశారు. కొంత కాలంగా వీరిద్దరిపై అసంతృప్తితో ఉన్న సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. 33 మంది కౌన్సిలర్లలో 25 మంది బీఆర్ఎస్  వారున్నారు. వీరిలో 12 మంది ఆ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ మద్దతుతో అవిశ్వాసం నోటీసు అందించారు. ఇదిలాఉంటే బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్  పదవులను దక్కించుకునేందుకు సిద్ధం కావడంతో ప్రతిపక్షాలు వారికి మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు.