
టీఎస్‌పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా ముఖ్యమైన అంశం. సిలబస్‌ను గమనిస్తే ఇందులో జనరల్ సైన్స్ కంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలే ముఖ్యమని అర్థమవుతోంది. అందుకే ప్రతి పరీక్షలోనూ వీటికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇందులో ఇస్రో చేపట్టే ప్రయోగాలు కీలకమైనవి. ప్రతి ఏడాది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టే ప్రయోగాలు దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో ఇస్రో చేపట్టే ప్రతి ప్రయోగం ఇంపార్టెంటే. ఇందులో ఉపయోగించే రాకెట్లు, శాటిలైట్లు, వాటిని అభివృద్ధిపరిచిన సంస్థలు, ఆయా ఉపగ్రహాల వల్ల కలిగే లాభాలు, ఏ రంగంలో కీలకం, ఎందుకు వినియోగిస్తున్నారనే అంశాలు గుర్తుపెట్టుకోవాలి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రోజుకో కొత్త చరిత్రకు శ్రీకారం చుడుతోంది. దేశ రక్షణకు, అభివృద్ధికి కావాల్సిన శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే పీఎస్‌ఎల్‌వీ సీ–44 ద్వారా కలాంశాట్ వీ2 , పీఎస్‌ఎల్‌వీ సీ–45 ద్వారా ఇమిశాట్ శాటిలైట్‌ను విజయవంతంగా పూర్తిచేసిన ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్) సీ–46 వాహక నౌకను మే 22న విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో 615 కిలోల బరువు గల రీశాట్–2 బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ– సీ–46 వాహక నౌక 557 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ మే 21 ఉదయం 4.30 గంటలకు ప్రారంభమైంది. 25 గంటల కౌంట్‌డౌన్ ముగిసిన అనంతరం మే 22 ఉదయం 5.30 గంటలకు పీఎస్‌ఎల్‌వీ –సీ–46 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ బయలుదేరిన 15.29 నిమిషాల అనంతరం రీశాట్ 2బీఆర్ 1 ఉపగ్రహం రాకెట్ నుంచి విడిపోయింది. నాలుగు దశలలో దీనిని 557 కిలోమీటర్ల ఎత్తులోని నిర్ణీత కక్ష్యలోకి పంపించారు. దీంతోపాటు ‘విక్రమ్’ ప్రాసెసర్‌ను, తక్కువ ఖర్చుతో ‘మెమ్స్’ ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థను కూడా పంపించారు. వీటిని చంఢీగఢ్‌లోని సెమీకండక్టర్ ల్యాబ్, ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ రూపొందించింది. ఆస్ట్రేలియాలోని ఓ ఉపగ్రహ ప్రయోగకేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని వీక్షించారు
రీశాట్–2బీఆర్ 1
పీఎస్‌ఎల్‌వీ సీ–46 అనే రాకెట్ ద్వారా రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని ఇస్రో మే 22న కక్ష్యలో నిలిపింది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్ భూకేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షించారు. ఉపగ్రహానికి అమర్చిన 3.6 మీటర్ల వ్యాసార్థమున్న రేడియల్ రిబ్ యాంటెన్నా విచ్చుకోవడంతో ఉపగ్రహం తన సేవలను ప్రారంభించినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
నాలుగు దశలు
పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను నాలుగు దశలలో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండానే ప్రయోగించారు. అందుకే ఈ ప్రయోగాన్ని ‘కోర్ ఎలోన్’ అని పేర్కొంటారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమైంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తయింది. అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రీశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 37 డిగ్రీల కోణంలో సూర్యుడి సమకాలీక కక్ష్యలోనికి దిగువ భూకక్ష్యలో విజయవంతంగా నిలిపారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 48వ ప్రయోగం కాగా ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి 36వ రాకెట్‌ను ప్రయోగించారు. ఇప్పటివరకు షార్ నుంచి 71 రాకెట్ ప్రయోగాలు జరిగాయి. ఇది 72 ప్రయోగం కాగా ఈ ఏడాది మూడో ప్రయోగం.
కచ్చితమైన సమాచారం
రీశాట్–2బీఆర్1 శాటిలైట్ అత్యాధునిక సింథటిక్ రాడార్ ఇమేజింగ్ భూపరిశీలన ఉపగ్రహం. రక్షణ శాఖకు ఉపయోగకరంగా ఉన్న అనేక ఉపగ్రహాలలో రీశాట్ అత్యంత కీలకమైన ఉపగ్రహంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఉపగ్రహ సాయంతో దేశ సరిహద్దులలోని శత్రువుల కదలికలను మరింత క్షుణ్ణంగా, సులభంగా గుర్తించేందుకు వీలుపడనుంది. వ్యవసాయరంగ పరిశోధనల కోసం నిర్మించినరీశాట్ ఉపగ్రహాలకు స్వల్పమార్పులు చేసి ఇస్రో రక్షణశాఖ కోసం వినియోగిస్తుంది. దీనివలన వ్యవసాయం, దేశంలోని అడవులకు సంబంధించిన సమగ్ర సమాచారంతోపాటు ప్రకృతి విపత్తులు సంభవించే కాలం అంచనాలు, ప్రత్యామ్నాయ నిర్ణయాలు తదితర విషయాలలో తన సేవలను విస్తరించనుంది. భారత సరిహద్దులో ఉగ్రవాద కార్యకలాపాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్–2బీ ఉపగ్రహంలో ఎక్స్‌బాండ్ అపార్చర్ రాడార్ నిర్మాణముంది. దీంతో దట్టమైన మేఘాలు ఆవరించినప్పటికీ భూ ఉపరితలపు ఫొటోలను తీసుకోవచ్చు. ఇందులో అమర్చిన అత్యాధునిక రాడార్ భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా స్పష్టమైన ఛాయాచిత్రాలను అందించగలుగుతుంది. సరిహద్దులోని శత్రు, ఉగ్రమూకల కదలికలను తెలియజేస్తుంది. అంతేకాకుండా వ్యవసాయరంగానికి సంబంధించిన నేలల రకాలు, పంటల సమాచారం వంటి వివరాలను విశ్లేషిస్తుంది. అటవీశాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన కాలంలో అత్యవసర సేవలందించేందుకు తోడ్పాటునందించనుంది. దీనివల్ల భారత వాతావరణ శాఖ ఖచ్చితమయిన సమాచారం పొందనుంది. ఇప్పటివరకు రీశాట్ సిరీస్‌లో రీశాట్–2, రీశాట్–1, స్కాట్‌శాట్ మాత్రమే సేవలందించేవి.
రీశాట్–2
2009 ఏప్రిల్ 20న పీఎస్‌ఎల్‌వీ సీ–12 రాకెట్ ద్వారా రీశాట్–2 ప్రయోగాన్ని నిర్వహించారు. ఇది రీశాట్ సిరీస్‌లో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం. వాతావరణానికి సంబంధించిన సమాచార సేకరణ ఆధారిత ఉపగ్రహాలలో రీశాట్–2 పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేయబడినది. ఈ ప్రయోగానికి ముందువరకు మనదేశం కెనడాకు చెందిన రాడార్‌శాట్–1, రాడార్‌శాట్–2 పైనే ఆధారపడేవి. ముంబయి ఉగ్రదాడులను దృష్టిలో పెట్టుకుని రీశాట్–2లో అధునాతన సాంకేతికతను వినియోగించారు. దీనికి ఇజ్రాయెల్ సహాయసహకారాలను అందించింది. ఈ ఉపగ్రహ వ్యవస్థకు గూఢాచారి వ్యవస్థనే పేరుంది. రీశాట్–2ను మోసుకెళ్లిన పీఎస్‌ఎల్‌వీ నౌక నాలుగు దశల్లో ఈ ప్రయోగాన్ని పూర్తి చేసింది. ఇజ్రాయెల్ నుంచి పొందిన ఎక్స్‌బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ నిర్మాణం ఈ వ్యవస్థలో కీలకమైనది. దీని ద్వారా సరిహద్దు భద్రతా చర్యలను సులభంగా చేపట్టే అవకాశం ఏర్పడింది. ఈ ఉపగ్రహం బరువు 300కేజీలు. దీనిద్వారా అనుశాట్ అనే మైక్రో శాటిలైట్‌ను కూడా ఉపయోగించారు.
2009 సెప్టెంబర్ 2న జరిగిన ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ దుర్ఘటన గాలింపు చర్యలలో రీశాట్–2 ఉపగ్రహం సేవలను వినియోగించారు. దట్టమైన అడవులలో, క్యుములో నింబస్ మేఘాలు ఆవరించిన వాతావరణంలో హెలికాప్టర్ అన్వేషణ కోసం ఈ ఉపగ్రహం ఎంతగానో తోడ్పడింది. పగలు, రాత్రనే తేడా లేకుండా స్పష్టమైన భూ ఛాయా చిత్రాలనందించే వ్యవస్థలో ఇందులో ఉంది. సముద్రజలాలపై నిఘా నేత్రంగా, నౌకలపై సూక్ష్మ సమాచారాన్ని ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది.
రీశాట్–1
2012 ఏప్రిల్ 26న పీఎస్‌ఎల్‌వీ సీ–19 ద్వారా రీశాట్–1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. వాతావరణానికి సంబంధించి మేఘావృత పరిస్థితులలో కూడా స్పష్టమైన చిత్రాలను పంపే ఆధునిక సాంకేతికత ఈ ఉపగ్రహం సొంతం. ఇందులో 160 × 4 డేటా హ్యాండ్లింగ్ సిస్టం, అత్యాధునిక కదలిక చక్రాలు, సింథటిక్ అపార్చర్ రాడార్ నిర్మాణాలున్నాయి. వ్యవసాయం, అడవుల సర్వే, వరదల నివారణ, వరి పంటల సమగ్ర సమాచారం ఈ ఉపగ్రహం అందించింది.
స్కాట్‌శాట్–1
2016 సెప్టెంబర్ 26న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ- సీ–35 రాకెట్ ద్వారా స్కాట్‌శాట్–1 ప్రయోగాన్ని నిర్వహించారు. దీంతోపాటు ప్రథమ్, పైశాట్ ఉపగ్రహాలతోపాటు అల్జీరియాకు చెందిన మూడు అల్‌శాట్ ఉపగ్రహాలను, అమెరికాకు చెందిన పాత్‌ఫైండర్, కెనడాకు చెందిన ఎన్‌ఎల్‌ఎస్-19 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. ఒకే రాకెట్‌తో రెండు భిన్న కక్ష్యల్లోకి ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రోకు ఇదే మొదటిసారి. పీఎస్‌ఎల్‌వీ- సీ–35 ద్వారా ఇస్రో మొత్తం 8 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇందులో ముఖ్యమైనది స్కాట్‌శాట్ శాటిలైట్. ఇది అత్యాధునిక వాతావరణ ఉపగ్రహం. వాతావరణ పరిశీలనకు, తుపానుల గుర్తింపు, వాటి గమనానికి సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ఉపయోగపడుతుంది. స్కాట్‌శాట్-–1లో కేయూ బ్యాండ్ స్కానింగ్ స్కాటెరోమీటర్ రాడార్ అనే పరికరం ఉంది. ఈ పరికరం నుంచి విడుదలయ్యే శక్తి తరంగాలు సముద్ర ఉపరితలాన్ని తాకి, తిరిగి ప్రతిధ్వనిలా పరావర్తనం చెందినప్పుడు కీలక సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా సముద్ర ఉపరితలాల గాలుల అధ్యయనానికి స్కాట్‌శాట్-–1 ఉపకరిస్తుంది. తుపానుల గమనం,హిమాలయాల్లో హిమ నిర్మాణం -తరుగుదల, మరీ ముఖ్యంగా గ్రీన్‌ల్యాండ్ హిమం తరుగుదల, తుపాను తీరందాటే కచ్చిత సమయాన్ని స్కాట్‌శాట్-–1 విశ్లేషిస్తుంది.
విరాజ్ శేఖర్ . కె
సబ్జెక్ట్ ఎక్స్పర్ట్