
యాదాద్రి, వెలుగు: మారిన జీవన శైలి, అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. తల్లిదండ్రుల అనారోగ్యం ప్రభావం పుట్టే పిల్లలపైనా పడుతోంది. దీంతో కొందరు చిన్న వయసులోనే బీపీ, షుగర్ బారినపడుతున్నారు. క్రమక్రమంగా వీరి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలోని 17 మండలాల్లో 8,30,894 మంది జనాభా ఉన్నారు. ఇందులో మహిళలు 4,15,502, పురుషుల 4,24,391 మంది. మొత్తం జనాభాలో 30 ఏండ్లు దాటినోళ్లు 4,61,778 ఉన్నారు.
అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమం(ఎన్సీడీ)లో భాగంగా ఇప్పటివరకూ 3,53,657 మందికి బీపీ, షుగర్ సహా వివిధ రకాల టెస్టులు చేశారు. టెస్ట్‌లు చేసిన వారిలో 87,334 మంది బీపీ, షుగర్, నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్తదితర వ్యాధులతో బాధపడుతున్నట్టు తేలింది.
30 ఏండ్లు రాకుండానే వ్యాధులు
గతంలో 50 ఏండ్లు దాటినోళ్లకు బీపీ, షుగర్ వంటివి వచ్చేవి. ఇప్పుడు మారిన జీవన శైలి, అలవాట్ల కారణంగా చిన్న వయసులోనే వీటి బారిన పడున్నారు. తాజాగా ఎన్సీడీ టెస్ట్‌లు చేసిన వారిలో 30 ఏండ్లలోపున్నోళ్లు కూడా బీపీ, షుగర్‌తో బాధపడుతున్నట్టు తేలింది. వీరిలో 286 మంది బీపీ, మరో 134 మంది షుగర్ బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్మెంట్ లెక్కలు చెబుతున్నాయి. మొత్తంగా బీపీతో 58,228, షుగర్‌తో 28,739 మంది బాధపడుతున్నారు. అయితే వీరిలో 30 నుంచి 60 ఏండ్ల వయసున్న వారిలో 43,506 మంది వీటి బారిన పడ్డారు.
మిగిలిన వారు 60 నుంచి 80 ఏండ్లలోపున్నోళ్లు ఉన్నారు. ఇందులో కొందరు ఒకటి కంటే ఎక్కువ డిసీజ్ లతో బాధపడుతున్నారు. కాగా ఓరల్ క్యాన్సర్‌తో 86, బ్రెస్ట్ క్యాన్సర్‌తో 172, సెర్వికల్ క్యాన్సర్‌తో 109 మంది బాధపడుతున్నారని తేలింది. గతేడాది నిర్వహించిన ఎన్సీడీ టెస్ట్‌ల కంటే ఈసారి బీపీ, షుగర్ బారిన పడిన వారి సంఖ్య మరింత పెరిగింది. గతేడాదిలో బీపీతో 46,460, షుగర్‌తో 23987 మంది బాధపడగా ఈసారి వారి సంఖ్య మరింత పెరిగింది.
ట్రీట్మెంట్కు హైదరాబాదే
యాదాద్రి జిల్లా హైదరాబాద్ సమీపంలోనే ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో వైద్య సదుపాయాలు లేవు. ఎయిమ్స్ ఏర్పాటు చేయడంతో ఇప్పుడిప్పుడే మంచి ట్రీట్మెంట్ అందుతోంది. అయినప్పటికీ.. ఎక్కువగా హైదరాబాద్‌లోనే కార్పొరేట్ హాస్పిటల్స్, గాంధీ, ఉస్మానియా, నిమ్స్ వంటివాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. బీపీ, షుగర్‌కు లకు పీహెచ్సీ, సీహెచ్సీల్లోనే మందులు ఇస్తున్నారు. ఇతర వ్యాధులున్న వారిని జిల్లాఆసుపత్రి, ఎయిమ్స్‌కు రిఫర్ చేస్తున్నారు. క్యాన్సర్ పేషెంట్లను ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్‌కు రిఫర్ చేస్తున్నారు. ఆర్ధికంగా స్థితిమంతులైన వారు కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు.