హైవేపై వెహికిల్ పార్కింగ్.. సౌలతులు లేక నిరుపయోగంగా ట్రక్​ లే బే ఏరియా

  • ఎక్కడబడితే అక్కడ ఆగుతున్న భారీ వాహనాలు
  • పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు

మహబూబ్​నగర్, వెలుగు:నేషనల్​ హైవే-44పై ఆగి ఉన్న వెహికల్స్​తో ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. హెవీ వెహికల్స్​ డ్రైవర్లు రెస్ట్​ తీసుకోవడానికి ట్రక్​ లే -బే ఏరియా ఏర్పాటు చేసినా.. సరైన సౌలతులు లేక డ్రైవర్లు రోడ్లపైనే వెహికల్స్​ను నిలుపుతున్నారు. దీంతో తరచూ ఆగి ఉన్న వెహికల్స్​ను.. ఇతర వాహనాలు, కార్లు ఢీకొట్టి ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. 

మెయింటెనెన్స్​ గాలికి..

నేషనల్​ హైవే నిర్మాణ సమయంలో భారీ వాహనాలు నిలుపుకోవడానికి, డ్రైవర్లు రెస్ట్​ తీసుకోవడానికి ట్రక్​ లే -బై ఏరియాను ఏర్పాటు చేస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 120 కిలోమీటర్ల ఎన్​హెచ్​-44 విస్తరించి ఉండగా.. అడ్డాకుల టోల్​ ప్లాజా సమీపంలో ఉన్న కొమిరెడ్డిపల్లి గ్రామం వద్ద ఒకటి, పుల్లూరు టోల్​ ప్లాజా సమీపంలో మరో ట్రక్​ లే -బై ఏరియాలు ఉన్నాయి. కొమిరెడ్డిపల్లి వద్ద ఉన్న ట్రక్​ లే -బైని అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాలు పార్కింగ్​ చేసిన డ్రైవర్లు భోజనాలు చేయడానికి అక్కడే ఒక హోటల్​ను ఏర్పాటు చేశారు. 

మూ‌‌త్రశాలలు, మరుగుదొడ్లను కూడా కట్టించారు. కానీ, ఇది ఓపెన్​ చేసిన కొద్ది రోజులకే నిరుపయోగంగా మారింది. గతంలో మహబూబ్​నగర్​ ఎస్పీలుగా పని చేసిన కొందరు ఆఫీసర్లు రోడ్ల పొంటి ఎక్కడబడితే అక్కడ వాహనాలు ఆపకుండా సిబ్బందితో కలిసి వెహికల్స్​ను ట్రక్​ లే- బే ఏరియాలో పార్కింగ్​ చేసేలా పెట్రోలింగ్​ చేయించారు. కానీ, కొంత కాలంగా ట్రక్​ లే -బే ఏరియాలో డ్రైవర్లు వాహనాలు ఆపడం లేదు. ప్రధానంగా నీటి వసతి లేకపోవడం, టాయిలెట్స్, వాష్​ రూమ్స్​ నిర్వహణ సరిగా లేకపోవడంతో అక్కడ ఎవరూ వాహనాలను ఆపడం లేదు. అలాగే పుల్లూరు టోల్​ ప్లాజా సమీపంలో ఏర్పాటు చేసిన ట్రక్​ లే -బే ఏరియాను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు. దీంతో భారీ వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు వాటిని ఎక్కడ ఆపాలో తెలియక హైవే పక్కనే వాటిని పార్కింగ్​ 
చేస్తున్నారు. 

తరచూ ప్రమాదాలు..

హైవే పొంటి భారీ వాహనాలను ఆపుతుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత ఏడాది ఆగస్టు 29న హైదరాబాద్​కు చెందిన ఉర్సుల కెంపురావు (78), అతని కొడుకు ఉర్సుల వెంకటరమణారావు (45), వీరి బంధువులు సువర్ణ లక్ష్మి, ఆవుల అంబిక, చిన్నారులు అక్షిత, శ్రియతో పాటు వెంకటరమణారావు స్నేహితుడు గోనె వెంకటరమణ తిరుపతి వెళ్లి తిరిగి వస్తుండగా.. ప్రమాదానికి గురయ్యారు. మహబూబ్​నగర్​ జిల్లా భూత్పూర్​ మండలం తాటికొండ గ్రామ శివారులో వీరి  కారు హైవేపై ఆగి ఉన్న డీసీఎంను వెనుక నుంచి ఢీ కొట్టడంతో కారు డ్రైవర్​ ఆశోక్(45)తో పాటు కెంపురావు, వెంకటరమణ అక్కడికక్కడే చనిపోయారు. 

తీవ్రంగా గాయపడిన వెంకటరమణారావు హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ పొందుతూ చనిపోయాడు. నాలుగు రోజుల కింద ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సు ఓవర్​ స్పీడ్​తో ముందు వెళ్తున్న కారును ఓవర్​ టేక్​ చేయబోయింది. కారును ఢీ కొట్టడంతో పాటు హైవే పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ఫ్రంట్​ సీటులో కూర్చున్న ఇద్దరు స్పాట్​లోనే చనిపోయారు. బస్సు డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా హైవేపై ఆగి ఉన్న వాహనాల కారణంగా తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

తనిఖీలు ఎక్కడ?

నేషనల్​ హైవేలపై భారీ వాహనాలు ఆపితే టోల్​ ప్లాజా నిర్వాహకులు అక్కడికి చేరుకొని ఆగి ఉన్న వాహనాలను పంపించాలి. పోలీసులు కూడా హైవేల పొంటి హెవీ వెహికల్స్​ నిలుపకుండా డ్రైవర్లకు కౌన్సెలింగ్​ ఇవ్వడంతో పాటు నిత్యం ఆ రూట్లలో తనిఖీలు నిర్వహించాలి. కానీ, కొంత కాలంగా రోడ్ల పొడవునా డ్రైవర్లు భారీ వాహనాలను ఆపుతున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. హైవేలను ఆనుకొని ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాల వద్ద పదుల కొద్దీ వాహనాలు ఆపినా పట్టించుకోవడం లేదు.

రెండేళ్లలో పాలమూరులో జరిగిన యాక్సిడెంట్​ వివరాలు

ఏడాది    ప్రమాదాలు    మృతులు    క్షతగాత్రులు
2023    556    244    463
2024    602    273    476