ఐపీఎల్ 2024లో అద్భుత ఫామ్ తో చెలరేగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 12వ తేదీ శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో చెలరేగిన రిషబ్ పంత్.. ఐపీఎల్ లో అతి తక్కువ బంతుల్లో 3 వేల పరుగులను సాధించాడు. స్టోయినిస్ వేసి 12 ఓవర్లలో చివరి బంతిని బౌండరికి తరలించిన పంత్ ఈ ఫీట్ ను అందుకున్నాడు. ఐపీఎల్ లో కేవలం 2028 బంతులల్లో పంత్ 3వేల పరుగులు చేశాడు. ఈ ఘనత సాధించి తొలి ఇండియన్ ప్లేయర్ గా పంత్ రికార్డ్ నెలకొల్పాడు. పంత్ తర్వాత యూసుఫ్ పఠాన్(2062 బంతులు), సూర్యకుమర్ యాదవ్(2130), సురేష్ రైనా(2135)లు ఉన్నారు.
అలాగే, అతి పిన్న వయసులో 3వేల పరుగులు సాధించిన మూడో క్రికెటర్ గా పంత్(26 ఏళ్ల 191రోజులు ) నిలిచాడు. పంత్ కంటే ముందు గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్(24ఏళ్ల 215 రోజులు), విరాట్ కోహ్లీ(26ఏళ్ల 186 రోజులు) ఉన్నారు.
శుక్రవారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 6వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి167 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ.. 18.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది. ఢిల్లీ బ్యాటర్లలో రిషబ్ పంత్ కేవలం 24 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, రెండు సిక్సులతో 41 పరుగులు చేసి ఢిల్లీ విజయం కీలక పాత్ర పోషించాడు.