దేశవ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తున్న ఐపీఎల్ కు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 22 నుంచి జరగనున్న ఈ టోర్నీ కోసం ప్రపంచ క్రికెటర్లు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ మునుపటి ఫామ్ ను అందుకున్నాడు. తనకే సాధ్యమైన ఒంటి చేత్తో సిక్సు కొడుతూ పాత పంత్ ను గుర్తు చేశాడు.
క్రికెట్ కు 15 నెలలుగా దూరంగా ఉంటున్న పంత్ ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నాడు. ఫిట్ నెస్ సాధించి పూర్తి స్థాయి ప్లేయర్ గా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. తాజాగా ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశాడు. ప్రాక్టీస్ సెషన్లో బ్యాటింగ్ చేస్తూ సింగిల్ హ్యాండ్ తో డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదేశాడు. దీంతో పంత్ ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు పంత్ ఫ్యాన్స్ ఈ సిక్సర్ ను చూసి పంత్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
పంత్ గైర్హాజరీతో గత సీజన్లో డేవిడ్ వార్నర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అతని కెప్టెన్సీలో ఢిల్లీ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట విజయం సాధించింది. దీంతో లీగ్ దశలోనే నిష్క్రమించడమే కాకుండా పాయింట్ల పట్టికలో కింద నుండి రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ పంత్ తిరిగి జట్టులో చేరినా పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టకపోతే మరోసారి వార్నర్ సారథిగా కొనసాగే అవకాశముంది.
ఇప్పటివరకూ ఐపీఎల్లో 98 మ్యాచ్‌లు ఆడిన పంత్ 2838 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, అతని ఖాతాలో 64 క్యాచ్‌లు, ఆరు రనౌట్లు, 18 స్టంపింగ్‌లు ఉన్నాయి.
Rishabh Pant and those one handed sixes. 🥹❤️pic.twitter.com/hRtPvrobPy
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 4, 2024