LSG vs GT: 5 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు.. మార్ష్‌ను పక్కన పెట్టడానికి కారణం ఇదే!

LSG vs GT: 5 మ్యాచ్‌ల్లో 4 హాఫ్ సెంచరీలు.. మార్ష్‌ను పక్కన పెట్టడానికి కారణం ఇదే!

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది.  శనివారం (ఏప్రిల్ 12) ప్రారంభమైన ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ స్థానంలో హిమ్మత్ సింగ్ తుది జట్టులోకి వచ్చాడు. సూపర్ ఫామ్ లో ఉన్న మార్ష్ ను పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదు. అతను ఫ్యామిలీ కారణంగా ఈ మ్యాచ్ కు అందుబాటులో ఉండడం లేదు. మార్ష్ కూతురు ఆరోగ్యం బాగాలేదని పంత్ టాస్ సందర్భంగా చెప్పుకొచ్చాడు. మార్ష్ ఆస్ట్రేలియాకు వెళ్లనున్నట్టు సమాచారం. అదే జరిగితే లక్నో జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టే. 

ప్రస్తుత సీజన్ లో మార్ష్ అద్భుత ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ 5 మ్యాచ్ ల్లో 53 యావరేజ్ తో 265 పరుగులు చేసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ 33 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ ఐదు మ్యాచ్‌ల్లో వరుసగా 72, 52, 0, 60, 81 పరుగులు సాధించాడు. ముఖ్యంగా మార్ష్ పవర్ ప్లే లో లక్నోకి మెరుపు ఆరంభాలను అందిస్తూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో మార్ష్ ను రూ. 3.4 కోట్లకు లక్నో జట్టు సొంతం చేసుకుంది. గత మూడు సీజన్ లు గా మార్ష్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. అయితే అతను చాలాసార్లు గాయం కారణంగా జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. ఢిల్లీ కంటే ముందు మార్ష్ గతంలో ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్, పూణే వారియర్స్, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  7 ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేసి చివరి టెస్టుకు జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత వెన్నుముక గాయంతో ఇబ్బంది పడిన మార్ష్.. పూర్తిగా కోలుకుని ఐపీఎల్ 2025లో అదరగొడుతున్నాడు.