KKR vs LSG: అప్పుడు వరల్డ్ కప్ ఫైనల్.. ఇప్పుడు ఐపీఎల్: యాక్టింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన పంత్

KKR vs LSG: అప్పుడు వరల్డ్ కప్ ఫైనల్.. ఇప్పుడు ఐపీఎల్: యాక్టింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన పంత్

ఐపీఎల్ లో మంగళవారం (ఏప్రిల్ 8) మధ్యాహ్నం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ జయింట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన హై స్కోరింగ్ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ 7 వికెట్లను 234 పరుగులు చేసి ఓడిపోయింది. 

భారీ స్కోర్ కళ్ళ ముందు కనబడుతున్నా కోల్‌కతా పోరాడిన తీరు అద్భుతం. టాపార్డర్ లో సునీల్ నరైన్ (13 బంతుల్లో 30) తో పాటు  కెప్టెన్ రహానే (35 బంతుల్లో 61:8 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. నరైన్ ఔటైనప్పటికీ వెంకటేష్ అయ్యర్ తో రహానే ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడడంతో కేకేఆర్ విజయం దిశగా పయనించింది. 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన కేకేఆర్ మరో 8 ఓవర్లలో 90 పరుగులు చేస్తే గెలుస్తుంది. చేతిలో 8 వికెట్లు ఉండడంతో కేకేఆర్ విజయం ఖాయమనిపించింది. 

Also Read:-కాన్వే రిటైర్డ్ ఔట్‌కు కారణం చెప్పిన గైక్వాడ్!

ఈ దశలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ తన తెలివిని ప్రదర్శించాడు. తనకు తిమ్మిర్లు వచ్చాయని ఫిజియోనీ పిలిపించాడు. దీంతో గ్రౌండ్ లో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. మధ్యలో బ్రేక్ రావడం లక్నోకి బాగా కలిసి వచ్చింది. 13 ఓవర్ నుంచి కోల్ కతా వరుసగా వికెట్లను కోల్పోతూ వస్తుంది. 7 ఓవర్లలో 77 పరుగులు చేయాల్సిన దశలో రహానే ఔట్ కావడంతో కోల్‌కతా ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ తర్వాత వెంటనే రఘువంశీ, రమణ్ దీప్ సింగ్ పెవిలియన్ కు చేరారు. ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్ పెవిలియన్ బాట పట్టడంతో కేకేఆర్ ఓటమి దిశగా పయనించింది. చివర్లో రింకూ సింగ్ పోరాడినప్పటికీ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

టీ20 ప్రపంచకప్‌ 2024 ఫైనల్లో వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ తెలివితేటలు భారత్ కు కప్ అందించడంలో సహాయం చేశాయి. క్లాసెన్, మిల్లర్ మ్యాచ్ ముగించేలా ఉన్న సమయంలో గాయం సాకుతో పంత్ సమయాన్ని వృథా చేశాడు. ఇలా చేయడం టీమిండియాకు అనుకూలంగా మారింది. ఆ నాలుగైదు నిమిషాలలో క్లాసెన్ ఏకాగ్రత కోల్పోయాడు తెలిపాడు. ఫైనల్ తర్వాత తాను కావాలనే యాక్టింగ్ చేశానని పంత్ చెప్పడం విశేషం. మరోసారి ఐపీఎల్ లో పంత్ అదే సీన్ రిపీట్ చేయడం లక్నో విజయానికి కారణమైంది.