బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కు అనారోగ్యం

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ కు అనారోగ్యం

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ అనారోగ్యం పాలయ్యారు. కాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ ను హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన అన్న రణధీర్ కపూర్ తెలిపారు. ఎప్పటినుంచో క్యాన్సర్ తో బాధపడుతున్న రిషి కపూర్ దాదాపు ఏడాది పాటు అమెరికాలో చికిత్స తీసుకున్నాడు. చికిత్స తర్వాత గత సెప్టెంబర్ లోనే ఆయన భారత్ కు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత మళ్లీ ఫిబ్రవరిలో కూడా రెండుసార్లు ఆస్పత్రి పాలయ్యాడు.

‘రిషి కపూర్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. అతనికి శ్వాస సమస్య కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం రిషి కపూర్ ఢిల్లీలో ఒక ఫంక్షన్ కు హాజరయ్యాడు. ఆ సమయంలో ఆయన కొంత ఇన్ఫెక్షన్ తో బాధపడ్డాడు. వెంటనే అక్కడే ఆస్పత్రిలో చేరాడు. కాస్త నయమయ్యాక ముంబైకి తిరిగి వచ్చాడు. ఆ మళ్లీ కొన్ని రోజులకు వైరల్ ఫీవర్ తో ఆస్పత్రిలో చేరాడు. రెండు రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు మళ్లీ బుధవారం కొంత అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉంది’ అని ఆయన అన్న రణధీర్ కపూర్ తెలిపారు.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రిషి కపూర్ ఏప్రిల్ 2 నుంచి తన ట్విట్టర్ ఖాతాలో ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. ఆయన ప్రస్తుతం దీపికా పదుకొనేతో హాలీవుడ్ చిత్రం ‘ది ఇంటర్న్’ సినిమాకి రీమేక్ లో నటించాల్సి ఉంది. ఈ సినిమా గురించి ఈ మధ్యే ప్రకటించారు.