
భైంసా, వెలుగు: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో రిషికన్య వేద విశ్వ విద్యాలయం నెలకొల్పేందుకు కృషి చేస్తానని పతంజలి యోగా పీఠ తెలంగాణ, ఆధ్రప్రదేశ్ రాష్ట్రాల మహిళా ప్రభారి మంజూష అన్నారు. భైంసాలో రిషికన్య వేద విద్యాలయం ఏర్పాటుపై వేద భారతి పీఠాధిపతి వేద విద్యానంద స్వామి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఇక్కడ నెలకొల్పే విద్యాలయాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
విశ్వ విద్యాలయంలో అభ్యసించే మహిళలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణంతోపాటు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. బాసరలో ఇప్పటికే మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్యా ప్రతిష్టాన్ అనుమతితో వేద పాఠశాల నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో బాసర వేద పాఠశాల కమిటీ అధ్యక్షుడు శ్యామ్ మందాని, కార్యదర్శి డా.రామకృష్ణ గౌడ్, కార్యవర్గ సభ్యులు గోపాల్, పతాంజలి యోగా పీఠం జిల్లా మహిళా అధ్యక్షురాలు శోభ మంధాని తదితరులు పాల్గొన్నారు.