- ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్స్
- బస్తీ దవాఖానాలకు రోజూ150 ఓపీలు
- జ్వరాలతో పాటు విజృంభిస్తున్న డెంగీ
- జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న డాక్ట ర్లు
హైదరాబాద్, వెలుగు : సిటీలో సీజనల్ ఫీవర్స్ పెరిగిపోతున్నాయి. దగ్గు, జలుబు, జ్వరాలతో బాధపడుతూ జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. కొద్దిరోజులుగా వరుస పడుతున్న వానలతో వైరల్‌ఫీవర్స్ తో పాటు, డెంగీ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో జూన్ లో అధికారికంగా104 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈనెలలో ఇప్పటివరకు 20కి నమోదవగా.. అనధికారికంగా ఈ సంఖ్య ఎక్కువగా ఉండొచ్చు. బస్తీ దవాఖానాల్లో రోజూ 150పైగా, ప్రధాన ఆస్పత్రులు గాంధీ, ఉస్మానియాల్లో 2 వేల ఓపీలు ఉంటున్నాయి. వీటిల్లో జనరల్ మెడిసిన్ ఓపీలు ఎక్కువ. సీజన్ ప్రారంభంలోనే కేసులు ఇలా ఉంటే.. ఆగస్టు, సెప్టెంబర్‌లో ఇంకా విజృంభించే అవకాశం ఉంది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
నాలుగు జిల్లాల్లో పెరుగుతోన్న కేసుల్లో
హైదరాబాద్ జిల్లాలో గత మే లో 39 డెంగీ కేసులు వస్తే, జూన్‌లో 56 నమోదయ్యాయి. ఈ నెలలో నాలుగు రోజుల్లోనే ఏకంగా 20 కేసులు నమోదవగా.. మున్ముందు పెరిగే చాన్స్ ఉంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 51 కేసులు నమోదయ్యాయి. గత మే లో 10, జూన్‌లో 18 కేసులు, మేడ్చల్‌జిల్లాలో మే లో 17, ఈ నెలలో ఇప్పటివరకు 30 కేసులు నమోదయ్యాయి. అలాగే వికారాబాద్ జిల్లాలో ఈ ఏడాది మొత్తం 8 డెంగీ కేసులు నమోదయ్యాయి.
వ్యక్తిగత శుభ్రత పాటించాలి
సాధారణంగా వైరల్ ఫీవర్, డెంగీ వంటివి దోమ కాటు, కలుషిత నీరు, ఆహారం తీసుకోవడంతో వస్తుంటాయి. ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా కూడా వ్యాప్తి చెందుతాయి. ప్రతి ఒక్కరు వ్యక్తిగత శుభ్రతతో పాటు, తమ ఇంటి పరిసరాల్లో మురుగునీరు, ఖాళీ టైర్లలో నీళ్లు, కుండీలు, కూలర్లలో నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఆహారం ఎప్పుడూ వేడిగా ఉండేలా చూసుకోవాలి, నీటిని కూడా వేడి చేసుకొని తాగాలి. ముఖ్యంగా బయటి ఫుడ్ జోలికి వెళ్లొద్దు. పిలల్లు స్కూళ్లలో ఇతర పిల్లలతో ఇంటరాక్ట్ అవుతారు. వారిపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఏమాత్రం జ్వరం వచ్చినా.. సొంతవైద్యం చేసుకోకుండా డాక్టర్లను సంప్రదించాలి.
యూరిన్ టెస్టులు చేయట్లే..
ఒకవైపు సీజనల్ ఫీవర్స్ఎక్కువవుతుంటే.. బస్తీ దవాఖానాల్లో అన్నిరకాల టెస్టులు చేయట్లేదనే విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 169 బస్తీ దవాఖానాలు ఉండగా.. ఒక్కో దాంట్లో రోజూ యావరేజ్‌గా 150 మంది పేషెంట్స్ వస్తున్నారు. అయితే.. మెజారిటీ బస్తీ దవాఖానాల్లో యూరిన్టెస్టులు చేయట్లేదు. కొన్ని దవాఖానాల్లో స్టాఫ్ కు మాత్రమే టాయిలెట్స్ఉండటం, మరికొన్ని చోట్ల టాయిలెట్స్లేకపోవడం కూడా యూరిన్ టెస్టులు చేయట్లేదని బస్తీ దవాఖానల డాక్టర్లు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల సౌకర్యాలు ఉన్నప్పటికీ యూరిన్ టెస్టులు చేయట్లేదు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోవట్లేదని పలువురు పేషెంట్లు విమర్శిస్తున్నారు.