- నివారణ చర్యలు చేపట్టని జీహెచ్‌ఎంసీ పాలకవర్గం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ఈసారి వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బెడద తప్పేలా లేదు. ఇంకా వానలు రాకముందే, జీహెచ్‌ఎంసీ పరిధిలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. జనవరి నుంచి ఏప్రిల్ వరకూ సుమారు 50 కేసులు నమోదైతే, మే నుంచి ఇప్పటివరకూ వందకుపైనే కేసులు నమోదయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ పాలకవర్గాన్ని హెల్త్ డిపార్ట్‌మెంట్ అలర్ట్ చేసి.. దోమలు, దోమ లార్వా నివారణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించింది.
అయితే, ఆ దిశగా ఇప్పటివరకూ జీహెచ్‌ఎంసీ చర్యలు ప్రారంభించలేదు. 2019లో డెంగీతో గ్రేటర్ జనాలు వణికిపోయారు. హాస్పిటళ్లన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడాయి. ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే మునుపటి తరహాలోనే ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయమై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును ప్రశ్నించగా.. డెంగీ కేసులు పెరుగుతున్నాయని, నివారణ చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీకి సూచించామని చెప్పారు.
ఆరోగ్యశాఖ తరఫున క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు టెస్టులు, చికిత్స అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు 184 హెల్త్ క్యాంపులు నిర్వహించామని, పది వేల మందికిపైగా ఈ క్యాంపుల్లో సేవలు అందించామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇండ్లలో ఎక్కడా నీటి నిల్వ లేకుండా చూసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి గ్రేటర్‌లో మాత్రమే డెంగీ కేసులు పెరుగుతున్నాయని, జిల్లాల్లో ఆ పరిస్థితి లేదని డీహెచ్ పేర్కొన్నారు.