గోదావరికి జలకళ .. భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద

గోదావరికి జలకళ .. భద్రాచలం వద్ద పెరుగుతున్న వరద

భద్రాచలం, వెలుగు : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరి జలకళను సంతరించుకుంది. భద్రాచలం వద్ద వరద స్వల్పంగా పెరుగుతోంది. స్నానఘట్టాల వద్దకు నీరు చేరడంతో చిరువ్యాపారులు తమ దుకాణాలను ఒడ్డుపైకి జరుపుకున్నారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నీటిపారుదల శాఖ ఆఫీసర్లు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

గోదావరికి జులై, ఆగస్ట్‌‌‌‌ నెలల్లో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కలెక్టర్‌‌‌‌ జితేశ్‌‌‌‌ వి. పాటిల్‌‌‌‌, ఐటీడీఏ పీవో రాహుల్‌‌‌‌, ఆర్డీవో దామోదర్‌‌‌‌లు ఇప్పటికే ఫ్లడ్‌‌‌‌ రివ్యూ మీటింగ్‌‌‌‌లు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత మండలాల్లో బఫర్‌‌‌‌స్టాక్‌‌‌‌లు, రీహబిలిటేషన్‌‌‌‌ సెంటర్ల ఏర్పాట్లపై మండల సెక్టోరియల్‌‌‌‌ ఆఫీసర్లను అలర్ట్‌‌‌‌ చేశారు. తీర ప్రాంతంలో నాటు పడవలు, గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎస్పీ రోహిత్‌‌‌‌ రాజ్‌‌‌‌ కూడా తమ శాఖ తరఫున రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు.