భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. ఎగువన ఉన్న రిజర్వాయర్ల ద్వారా రిలీజ్అయిన నీటితో మంగళవారం రాత్రి 11 గంటలకు 41 అడుగులకు చేరుకుంది. అర్ధరాత్రి వరకు మరింత పెరిగి, ఆ తరువాత నెమ్మదిస్తుందని సీడబ్ల్యూసీ ఇంజనీర్ల అంచనా. కాగా, శ్రీరాంసాగర్నుంచి వచ్చే వరద ఇంకా భద్రాచలం చేరుకోలేదు. బుధవారం సాయంత్రం వరకు వరద వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఉన్న అశ్వాపురం, మణుగూరు, పినపాక, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు వరద సమాచారం ఇచ్చేందుకు భద్రాచలం ఐటీడీఏ, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరద ప్రభావిత మండలాల్లో సెక్టోరియల్ఆఫీసర్లను అలర్ట్ చేశారు. అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టారు.