
న్యూఢిల్లీ: ఇన్సూరెన్స్ ప్రీమియంలను ఆరోగ్య బీమా కంపెనీలు పెంచడం మొదలు పెట్టాయి. హెల్త్ సంబంధిత ఖర్చులు పెరగడంతో పాటు, క్లెయిమ్ సెటిల్‌మెంట్లు ఎక్కువవ్వడంతో పాలసీ ప్రీమియంలను పెంచుతున్నాయి. లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం, తమ ప్రీమియం గత ఏడాది కాలంలో 25 శాతం కంటే ఎక్కువ పెరిగిందని 52 శాతం మంది వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీదారులు తెలిపారు. 0–-25 శాతం మధ్య పెరిగిందని 27 శాతం మంది పేర్కొనగా, ఎలాంటి పెరుగుదల కనిపించలేదని 14 శాతం మంది చెప్పారు.
మిగిలిన వారు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కాగా, ఈ సర్వేలో 18,067 మంది పాల్గొన్నారు. రానున్న నెలల్లో చాలా కంపెనీలు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలను పెంచుతాయని, ఈ పెరుగుదల 5- శాతం నుంచి 18 శాతం మధ్య ఉండొచ్చని హెర్క్యులస్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ ఫౌండర్ నిఖిల్ ఝా అంచనా వేశారు. నివా బూపా రీఅస్యూర్ 2.0, కేర్ సుప్రీమ్ హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ ప్రీమియంలు గత ఏడాది కాలంలో పెరిగాయని వివరించారు. స్టార్ వంటి కొన్ని సంస్థలు ప్రీమియం రేట్లను దాదాపు 60 శాతం–-70 శాతం వరకు పెంచాయని అన్నారు. పాలసీబజార్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అమిత్ ఛాబ్రా మాట్లాడుతూ, ప్రీమియంలు పెరుగుతున్నప్పటికీ, ఇది సాధారణమేనని అన్నారు.
కొవిడ్ టైమ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు బాగా నష్టపోయాయని, ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ప్రీమియంలను పెంచవలసి వస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వైద్య సంబంధిత ఖర్చులు గత ఏడాది కాలంలో దాదాపు 15 శాతం పెరిగాయని, ఆరోగ్య సమస్యల కేసులు ఎక్కువయ్యాయని వివరించారు.
ఏళ్లకు ఒకేసారి..
ఒక సంవత్సరానికి కాకుండా ఐదేళ్లకు ఒకసారి వంటి మల్టీ ఇయర్ పాలసీలను తీసుకోవాలని, ఇటువంటి పాలసీలలో ప్రీమియంను ముందుగానే చెల్లించాల్సి వస్తుందని ఎనలిస్టులు చెబుతున్నారు. మల్టీ ఇయర్ పాలసీలు సాధారణంగా రెండు నుంచి ఐదేళ్ల వరకు అంటే ఎక్కువ కాలానికి కవరేజీ అందిస్తాయి. మల్టీ ఇయర్ మెడిక్లెయిమ్ ప్లాన్‌ను కొంటే ప్రీమియంలలో కొంత డిస్కౌంట్ కూడా పొందొచ్చు.
ఇండియాలోని చాలా ఆరోగ్య బీమా కంపెనీలు రెండేళ్ల కోసం పాలసీ తీసుకుంటే ప్రీమియంలో 10 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. కానీ, కంపెనీ నిబంధనలు, షరతులను మారిస్తే మాత్రం పాలసీ హోల్డర్ ఇబ్బంది పడొచ్చు. బయటకొచ్చేయాలని అనుకున్నప్పుడు పెద్దగా ఆప్షన్స్ ఉండవు. మల్టీ ఇయర్ పాలసీల్లో నో క్లెయిమ్ బోనస్ లెక్కింపు కొంచెం క్లిష్టంగా
ఉంటుంది.