మణుగూరు, వెలుగు: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల అరెస్టులను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కూనవరం రైల్వే గేట్ దగ్గర మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ సింగరేణి యాజమాన్యానికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రభుత్వం అడ్డుకునేందుకు అక్రమ అరెస్టులు చేయించిందని ఆరోపించారు. కాంట్రాక్టు కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జేఏసీ నాయకులు నెల్లూరు నాగేశ్వరరావు, మధుసూదన్ రెడ్డి, మిడిదొడ్ల నాగేశ్వరరావు, దుగ్యాల సుధాకర్, అక్కి నరసింహారావు పాల్గొన్నారు. ఆందోళనకు పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి.
కొత్తగూడెంలో..
భద్రాద్రికొత్తగూడెం: చలో అసెంబ్లీకి వెళ్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జీఎం ఆఫీస్ ఎదుట ఎస్సీ, ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ సింగరేణి విభాగం ప్రెసిడెంట్ రాసూరి శంకర్ మాట్లాడుతూ ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. నాయకులు ఎం. కరుణాకర్, శ్రీనివాస్, సుమన్, నాగేశ్వరరావు, పుల్లయ్య పాల్గొన్నారు.
భారీగా రేషన్ బియ్యం పట్టివేత
భద్రాచలం,వెలుగు: కొత్తగూడెం, అశ్వాపురం నుంచి తరలిస్తున్న 514 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మూడు లారీలు, టాటా ఏస్ వెహికల్లో భద్రాచలం మీదుగా తరలిస్తుండగా సివిల్ సప్లైడీటీ వెంకటేశ్వరరావు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని కాకినాడ, రాజమండ్రి, చట్టి, ఛత్తీస్‌గఢ్‌కు వీటిని తరలిస్తున్నట్లు నిందితులు చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని జీసీసీ గోదామ్‌కు తరలించారు. పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
పాల్వంచలో..
పట్టణంలోని కేఎస్ఎం డాబా వద్ద అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని పట్టణ పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కల్యాణ్ దాబాలో బియ్యం నిల్వ ఉంచారనే సమాచారంతో పట్టణ ఎస్సై నరేశ్ దాడి చేసి పట్టుకున్నారు. డాబాల వద్ద చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. డాబా యజమానిపై కేసు నమోదు చేశారు.
బియ్యం షార్టేజ్..
అన్నపురెడ్డిపల్లి: మండలంలోని అబ్బుగూడెం గ్రామంలో జీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేషన్ షాపు డీలర్ పై మంగళవారం సివిల్ సప్లై ఆఫీసర్లు విచారణ జరిపారు. ఈ నెల 6న రాష్ట్ర విజిలెన్స్ ఆఫీసర్లు గ్రామాన్ని సందర్శించగా షాపు మూసి ఉండడంతో సీజ్ చేశారు. ఈ క్రమంలో సివిల్ సప్లై డీటీ కృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది, గ్రామస్తులసమక్షంలో షాపు తెరిచి బియ్యం నిల్వలను పరిశీలించారు. 86 క్వింటాళ్ల బియ్యం షార్టేజ్ రావడంతో రికార్డులను పరిశీలించి డీలర్ రామకృష్ణపై కేసు నమోదు చేశారు. డీలర్‌గా బాలుకు బాధ్యతలు అప్పగించినట్లు డీటీ తెలిపారు. జీసీసీ మేనేజర్ నరసింహ, ఆర్ఐ మధు, సర్పంచ్ ప్రమీల, సెక్రటరీ శాంతి ఉన్నారు.
ప్లాంటేషన్ లో చెట్లు నరికితే కఠిన చర్యలు
చండ్రుగొండ,వెలుగు: పోడు సాగు పేరుతో ఫారెస్ట్ లోని ప్లాంటేషన్ ను నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని భద్రాద్రి కొత్తగూడెం సీసీఎఫ్ భీమానాయక్ హెచ్చరించారు. మంగళవారం రామవరం రేంజ్ లోని దామరచర్ల బీట్ పరిధిలో ప్లాంటేషన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫారెస్ట్ లో డ్యూటీలో ఉన్న సిబ్బంది పై దాడి చేసినా, విధులకు ఆటంకం కలిగించినా సహించేది లేదన్నారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని కోరారు. అడవులను రక్షించకపోతే
భావి తరాలు ఇబ్బంది పడతాయని చెప్పారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎఫ్ వో రంజిత్ నాయక్, ఎఫ్ డీవో అప్పయ్య, ఎఫ్ఆర్వో ఉమ, ఎఫ్ఎస్వో బాలాజీ, బీట్ ఆఫీసర్లు ఉన్నారు.
అభివృద్ధి పనులకు సహకరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: అభివృద్ధి పనులకు సహకరించాలని కలెక్టర్ వీపీ గౌతమ్ కోరారు. మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, 3వ రైల్వే లైన్ భూనిర్వాసితులతో జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3వ రైల్వే లైన్ కోసం126 ఎకరాల భూసేకరణ చేపడుతున్నట్లు తెలిపారు. భూమి కోల్పోతున్న రైతులతో సంప్రదింపులు జరిపి ధర నిర్ణయించేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చింతకాని గ్రామంలో 8 మంది రైతులకు చెందిన 2.33 ఎకరాలు, నాగులవంచ గ్రామానికి చెందిన 24 మంది రైతుల నుంచి 4.37 ఎకరాలు, అనంతసాగర్ గ్రామానికి చెందిన 28 మంది రైతుల నుంచి 7.14 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ ఎన్. మధుసూదన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్డీవో రవీంద్రనాథ్, రైల్వే ఆఫీసర్ సూర్యనారాయణ, చింతకాని తహసీల్దార్ మంగీలాల్ పాల్గొన్నారు.
సింగరేణి కాంట్రాక్టర్లతో అత్యవసర మీటింగ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులు చేస్తున్న సమ్మె నేపథ్యంలో కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్లో కంపెనీలోని కాంట్రాక్టర్లతో మంగళవారం యాజమాన్యం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జీఎం(పర్సనల్) ఎ. ఆనందరావు మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి కాంట్రాక్ట్కార్మికులు సమ్మె చేస్తున్నారని, దీంతో కాలనీల్లో పారిశుధ్యం లోపించిందని చెప్పారు. దీనికి పూర్తి బాధ్యత కాంట్రాక్టర్లదేనని, ఒప్పందం ప్రకారం పారిశుధ్య పనుల్లో ఆటంకం లేకుండా చూడాలని అన్నారు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంట్రాక్టర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికులు మారడం లేదని, దీంతో ఈ సమస్య వస్తుందని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రాక్టర్ మారినప్పుడు 50 శాతం కొత్త కార్మికులను నియమించుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. ఈ నెల 14 నుంచి కార్మికులు డ్యూటీకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీఎం (సివిల్) సీహెచ్ రమేశ్‌బాబు, ఏజీఎం కవితానాయుడు
పాల్గొన్నారు.
హాస్టళ్లను తనిఖీ చేసిన జడ్జి
ఇల్లందు,వెలుగు: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముఖేశ్ సూచించారు. హైకోర్టు ఆదేశాల మేరకు మంగళవారం ఆయన పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేశారు. హాస్టళ్లలోని కిచెన్, డైనింగ్‌హాల్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని, పట్టుదలతో కృషి చేయాలని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే న్యాయ సేవా అధికార సంస్థ దృష్టికి తేవాలని సూచించారు. గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ఎం అనసూర్య, వార్డెన్ రామకోటేశ్వరితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య
ఖమ్మం రూరల్, వెలుగు: భర్త వేధింపులు భరించలేక రూరల్ మండలం జలగంనగర్‌కు చెందిన శ్రీరంగ రేణుక(30) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రూరల్ మండలం గుర్రలపాడు గ్రామానికి చెందిన రేణుకతో జలగంనగర్‌కు చెందిన శ్రీరంగం ఈశ్వర్‌కు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.లక్ష నగదు, పది గుంటల వ్యవసాయ భూమి ఇచ్చారు. కొంతకాలంగా అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి సర్ది చెప్పారు. కొంత భూమి అమ్మి రూ. 11 లక్షలు ఇచ్చారు. సోమవారం రేణుక తన తండ్రి వెంకటేశశ్వర్లుకు ఫోన్ చేసి కోళ్లఫారం పెట్టేందుకు తన భర్తకు రూ. 2 లక్షలు అవసరం ఉందని అడగగా, కొంత సమయం కావాలని అన్నాడు. మంగళవారం ఉదయం మరోసారి ఫోన్ చేసి డబ్బులు అడిగింది. ఇంతలోనే మధ్యాహ్నం 12 గంటలకు తన అల్లుడు ఫోన్ చేసి రేణుక ఉరేసుకొని చనిపోయిందని చెప్పాడని తండ్రి వాపోయాడు. అల్లుడు ఈశ్వర్ వేధింపులతోనే తన కూతురు రేణుక మృతి చెందిందని తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్సై శంకర్రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.