
పడి లేవటం కెరటానికి ఈజీ కానీ, కెరీర్లో పడి లేవటం అంత ఈజీ కాదు. దానికి చాలా కష్టపడాలి. అలా పడి లేచిన స్టార్ ఆమె. ‘ఇక ఆమె పని అయిపోయింది’ అనుకుంటున్న సమయంలోనే తన పనేంటో గుర్తించింది. చాలా కాలం ఆఫర్స్ లేక ఖాళీగా ఉన్నా...ఆమె చేసిన ఫైట్, సక్సెస్‌కి బాట వేసింది. బౌన్స్ బ్యాక్ అయ్యి బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న 37 ఏళ్ల నటి నుష్రత్ బరుచా జర్నీ ఇది.
రెండు నెలల కిందట నేను నటించిన ‘జన్ హిత్ మే జారీ’ సినిమా రిలీజ్ అయింది. ఒక చిన్న టౌన్లో కండోమ్స్ అమ్మే సేల్స్‌గర్ల్ క్యారెక్టర్ నాది. నాకు ఈ కథ చెప్పినప్పుడే ఆ పాత్ర ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నా. రాజ్‌తో ఇంతకుముందు ‘డ్రీమ్ గర్ల్’ మూవీ చేశా. చిన్న టౌన్లో ఉండే అమ్మాయి కాబట్టి స్పీడ్‌గా మాట్లాడాలి. ముంబైలో పెరగడం వల్ల అలా మాట్లాడటం నాకు ఛాలెంజింగ్. కానీ, సెట్లో అడుగుపెట్టాక ఒక మజా వచ్చింది. కండోమ్స్ అమ్మే అమ్మాయి క్యారెక్టర్ చేసినందుకు, సోషల్ మీడియాలో నాపై నెగెటివ్ కామెంట్లు విపరీతంగా వచ్చాయి. అవి నన్ను, నా ఫ్యామిలీని చాలా డిస్టర్బ్ చేశాయి. కొన్ని రోజుల పాటు సరిగా నిద్రపోలేదు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశా.
ఫస్ట్ ఛాన్స్
డిగ్రీ చదువుతున్నప్పుడే ఒక టాలెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో పనిచేశా. అక్కడ ఉన్నప్పుడే 2002లో ‘కిట్టి పార్టీ’ సీరియల్లో ఒక చిన్న రోల్ చేసే అవకాశం వచ్చింది. ఏడాది పాటు ఆ సీరియల్ చేసి బయటకు వచ్చేశా. ఎక్కువ టైం పనిచేయాల్సి రావడమే కాకుండా, టాక్సిక్ వాతావరణం ఉండటంతో ఆ సీరియల్‌కి గుడ్ బై చెప్పా. ఆ తర్వాత కొన్నేండ్ల పాటు థియేటర్ ఆర్టిస్ట్‌గా చేశా. డిగ్రీ అయిపోగానే నటిగా కెరీర్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యా. అయితే, మా కమ్యూనిటీలో యాక్టింగ్‌ను మంచి ప్రొఫెషన్‌గా చూడరు. అందుకని మా ఫ్యామిలీ, బంధువులకు యాక్టింగ్ అనేది నాకు సమ్మర్ జాబ్ అని చెప్పేదాన్ని. అలా 2006లో ‘జై సంతోషి మా’ అనే హిందీ మూవీలో చేశా. కొన్ని మ్యూజిక్ వీడియోల్లో కూడా నటించా. 2009లో వచ్చిన ‘కల్ కిస్నే దేఖా’ లో ఒక కామీయో రోల్ చేశా.
అన్నీ రిజెక్షన్సే...
మొదట్లో ఎక్కడ ఆడిషన్ ఉన్నా వెళ్తుండేదాన్ని. వెళ్లిన ప్రతిచోట ‘మీ ఆడిషన్ బాగుంది కానీ, మీరు ఈ రోల్‌కి సరిపోరు’ అని రిజెక్ట్ చేసేవారు. ‘లుక్ బాగోలేదా? స్టైల్ బాగోలేదా? ఏజ్, హైట్, కలర్... అసలు ప్రాబ్లమ్ ఏంట’నేది చెప్పేవాళ్లు కాదు. ఆడిషన్‌కి వచ్చిన వేరే అమ్మాయిలను చూసి వాళ్లతో పోల్చుకుని నా లుక్ బాగోలేదేమో అనుకునేదాన్ని. కానీ, రోల్ ఇచ్చేదెవరో? వాళ్లు చూసేదేంటో? మనకు తెలియదనే విషయం అర్థమయ్యాక.. మనల్ని చూసేవాళ్ల కోసం వెయిట్ చెయ్యాలని డిసైడ్ అయ్యా. నాలో టాలెంట్ ఉంది. దాన్ని నమ్మిన వాళ్లతో పని చేయాలనుకున్నా.
ట్రాక్‌లో పడ్డా అనుకున్నా...
‘తాజ్‌మహల్’ సినిమా ద్వారా 2010లో టాలీవుడ్‌కి పరిచయమయ్యా. అది కూడా సరిగ్గా ఆడలేదు. అదే సంవత్సరం ఏక్తాకపూర్ డైరెక్ట్ చేసిన ‘లవ్ సెక్స్ అవుర్ ధోఖా-’(ఎల్ఎస్డి)లో లీడ్ రోల్ చేసే ఛాన్స్వచ్చింది. అది యావరేజ్‌గా ఆడింది. ఈ సినిమాకు ముందు నన్ను రిజెక్ట్ చేశారు ఏక్తాకపూర్. కానీ, నాకు అదృష్టం కలిసొచ్చి వాళ్లు తీసుకున్నామె షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోవడంతో నన్ను పిలిచారు. ఆడిషన్ ఇచ్చిన చాలా రోజుల తరువాత పిలుపొచ్చింది నాకు.
వర్క్ షాప్ తర్వాత నన్ను సినిమాలోకి తీసుకున్నారు. ఎల్.ఎస్.డి. తర్వాత చాలామంది జర్నలిస్టులు నా ఇంటర్వ్యూ కోసం వచ్చారు. పొగిడారు. ‘వాహ్...నేను సాధించా’ అనుకున్నా. కానీ, నేను అనుకున్నదేం జరగలేదు. అందరూ పొగిడారు. వెళ్లిపోయారు. ఏడాది గడిచినా ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు. ‘ప్యార్ కా పంచనామా(పీకేపీ)’ మూవీలో నటించేందుకు నన్ను ఒప్పించారు. ఆ తర్వాత రెండేండ్లకు ‘ఆకాశ్వాణి’ చేశా.
నమ్మకం పోయింది
‘ఎల్.ఎస్.డి.’ లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీస్ మాత్రమే చేయాలనుకున్నా. అవకాశాలు లేక, ఇష్టం లేకున్నా 2013లో ‘ఆకాశవాణి’ చేశా. అప్పుడు ఢిల్లీలో మా ఫ్రెండ్స్‌ని కలవడానికి వెళ్లా. నా ఫ్రెండ్ వాళ్ల పేరెంట్స్ నేను చేసిన ‘ఆకాశ వాణి’ చూద్దామన్నారు. అప్పుడది ఢిల్లీలో ఒక్క థియేటర్లోనే ఆడుతోంది. అందరం వెళ్లాం. థియేటర్లో మా పక్కన ఐదుగురు అబ్బాయిలు కూర్చున్నారు. సినిమాలోని ప్రతి సీన్‌కి లైవ్ కామెంటరీ చేశారు. సినిమాను తిట్టారు.
వాళ్లకేం నచ్చలేదో మొత్తం చెప్తూనే ఉన్నారు. ఆ తరువాత నన్ను చూసి, వాళ్లు పారిపోయారు. కానీ, థియేటర్ ఖాళీ అయిపోయినా నేను మాత్రం అక్కడ్నించి కదల్లేకపోయా. ఆ ఫెయిల్యూర్ నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టింది. ఆ క్షణం నుంచి నేను యాక్టర్, పర్ఫార్మర్ అనే నమ్మకం పోయింది. ఆఖరికి మనిషిగా కూడా నా మీద నాకు నమ్మకం పోయింది. దాన్నుంచి బయటపడేందుకు రెండేండ్లు పట్టింది. పీకేపీ-–2 వచ్చే వరకు అలానే ఉన్నా. నేను చాలా ఎమోషనల్, సెన్సిటివ్. నన్ను నేను మోటివేట్ చేసుకునేందుకు ఆ రెండేండ్లు చాలా స్ట్రగుల్ పడ్డా.
నాకు ఇష్టమైనవే చేస్తున్నా
2015 తర్వాత నాకు నచ్చిన సినిమాలు, పాత్రలు ఎంచుకోవడం మొదలుపెట్టా. అప్పట్నించీ సక్సెస్ చూస్తున్నా. అలా ‘సోను కె టిటూ కి స్వీటీ’ మూవీ బ్లాక్ బాస్టర్ అయ్యింది. ఆ తర్వాత 2019లో ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘డ్రీమ్ గర్ల్’ సూపర్ హిట్ అయింది. కొవిడ్ టైంలో విడుదలైన ‘ఛలాంగ్’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై, మంచి పేరు తెచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘అజీబ్ దాస్తాన్స్’ పాన్ ఇండియా గుర్తింపు తెచ్చింది. మంచి సినిమాలు చేస్తూనే యోయో హనీ సింగ్‌తో పాటు ఇంకొందరు మ్యూజిక్ స్టార్స్ చేసిన మ్యూజిక్ వీడియోల్లో కూడా కనిపించా. నేను సోలో గా చేసిన ఫస్ట్ మూవీ ‘చోరీ’. ఈ సినిమా పోయిన ఏడాది వచ్చింది. సూపర్ హిట్ అయిన ఈ మూవీకి సీక్వెల్ కూడా రాబోతోంది. ఈ దీపావళికి ‘రామ్ సేతు’ తో మళ్లీ మీ ముందుకు వస్తున్నా. వీటితో పాటు ఇంకో రెండు ప్రాజెక్ట్స్ షూటింగ్ చేస్తున్నా.
మనసు చెప్పేదే నమ్మాలి
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా నేను ఈ పొజిషన్‌కు రాగలిగానంటే కంటెంట్ ఉన్న సినిమాలను చేయడం వల్లే. చేతిలో సినిమాలు లేని రోజులు చూశా. చేతి నిండా సినిమాలు ఉన్న రోజులు చూస్తున్నా. జీవితంలో కష్టం, సుఖం రెండూ ఉంటాయి. ఏ పరిస్థితుల్లో అయినా మనసు చెప్పేదాన్ని నమ్మాలి. ఓపికగా హార్డ్ వర్క్ చేయాలి. కష్టాలు ఎదుర్కొన్నప్పుడే బలం పెరుగుతుంది. మనకు ఆ బలం వచ్చిందంటే, కచ్చితంగా జీవితం బెటర్‌గా ఉంటుంది.
బాధితులం కావద్దు
మనల్ని మనం బాధితులుగా భావించడమే అన్నింటికంటే పెద్ద ఓటమి. ‘నాకే ఎందుకు ఇలా జరుగుతుంది?’ అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇలాంటి మైండ్ సెట్ నుంచి బయటపడిన క్షణంలోనే మనం అనుకున్న ప్రతీది జరుగుతుంది. పదేండ్ల కింద ‘నేను మూవీస్ చేశా’ అని చెప్తే ‘ఏం చేశావని’ ఆశ్చర్యంగా అడిగిన వాళ్లున్నారు. ఓడిపోయిన ప్రతిసారి నాలో పట్టుదల పెరిగింది. నాకు ఏ పాత్ర చేసే అవకాశం వచ్చినా చేశా... అది హీరోయిన్ లేదా విలన్. చేస్తూనే పోయా. పోరాడా. కానీ ఓటమికి బాధితురాలిని కాదల్చుకోలేదు. తర్వాత పరిస్థితులు వాటంతటవే మారిపోయాయి. ఇప్పుడు నాకు మంచి సినిమాల్లో, మంచి రోల్స్ చేసే అవకాశాలు వస్తున్నాయి. ::: గుణ