ఎమ్మెల్యే అభ్యర్థులకు కోవర్టుల ఫియర్ .. వలస లీడర్లపై నిఘా పెడుతున్న లీడర్లు

  • ముఖ్య సమావేశాలు, రహస్య మంతనాలకు వలస లీడర్లను దూరం పెడుతున్న వైనం 
  • ఎలక్షన్​ సమీపించడంతో అన్ని పార్టీల్లోనూ చేరికల జోరు 

గతంలో జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ​లీడర్​ బీఆర్ఎస్‌‌‌‌లోకి వెళ్తారన్న ప్రచారంతో ఆ పార్టీ కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు. తీరా పొలిటికల్ ఈక్వేషన్స్ మారడంతో సదరు లీడర్​కాంగ్రెస్‌‌‌‌లోనే కొనసాగుతున్నారు.  కాగా వారు ప్రస్తుతం బీఆర్ఎస్ కౌన్సిలర్లుగా చలామణీ అవుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యే వారికి ప్రయారిటీ ఇవ్వడం లేదు. ఆయా కౌన్సిలర్ల వార్డుల్లోని డెవలప్‌‌‌‌మెంట్​పనులు కూడా తన అనుచరులకు అప్పగించాడు.

దీంతోపాటు ఇక్కడి సమాచారం ప్రత్యర్థి పార్టీకి చేరవేస్తారన్న అనుమానంతో సమావేశాలు, రహస్య మంతనాలకు కూడా వారిని దూరం పెట్టారు. దీంతో సదరు కౌన్సిలర్లు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ యాక్టివ్​కావడంతో తిరిగి ఆ పార్టీలోకి వెళ్లాలని చూస్తుండగా సదరు ఎమ్మెల్యే వారిని బుజ్జగిస్తున్నారు. ఇలా ప్రతి పార్టీలోనూ కోవర్టుల భయాలు కొనసాగుతున్నాయి’ 

జగిత్యాల, వెలుగు: ఎమ్మెల్యే అభ్యర్థులకు కోవర్టుల భయం పట్టుకుంది. ముఖ్యంగా గ్రామాలు, వార్డుల్లో అభివృద్ధి కోసమంటూ ప్రత్యర్థి పార్టీల్లో చేరిన లీడర్లను ఎమ్మెల్యే అభ్యర్థులు అనుమానంగా చూస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోటాపోటీ ప్రచారాలు, చేరికలతో హీట్ పెరిగింది. విపక్ష పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలను ఆపరేషన్ ఆకర్ష్​పేరిట పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్న వలస వచ్చిన నేతలతో ఎమ్మెల్యే అభ్యర్థులకు కొత్త తలనొప్పులు వస్తున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.

పార్టీలో చేరిన ఆ లీడర్లు తమ గెలుపు కోసం పనిచేస్తారో.. లేదా పాత లీడర్లకు తమ వ్యూహాలను చేరవేస్తారోనన్న భయంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. దీంతో రహస్య సమావేశాలు, ముఖ్య నేతల సమావేశాలకు వారిని ఆహ్వానించడం లేదు. మరోవైపు తమను ఇలా దూరం పెడుతూ అవమానిస్తున్నారని వలస నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీల్లో కొనసాగుతున్నప్పటికీ తమ విజయానికి పనిచేస్తారో  లేదోనన్న టెన్షన్​ అభ్యర్థుల్లో ఉంది. దీంతో ప్రచారంతో పాటు కోవర్టులపై ఫోకస్ చేయాల్సి వస్తోందని అభ్యర్థులు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. 

వలస లీడర్లపై అభ్యర్థుల నిఘా

ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్థులకు కోవర్టుల భయం పట్టుకుంది. గతంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బలమైన క్యాడర్‌‌‌‌‌‌‌‌ను చేర్చుకొని వారికి బీఆర్ఎస్‌‌‌‌లో సముచిత స్థానాలు కల్పించారు. ఇదే టైంలో కొందరు ఉద్యమ నేతలు క్రమంగా దూరమవుతూ వచ్చారు. అయినప్పటికీ హైకమాండ్​ మీద నమ్మకంతో ఇన్నాళ్లు పార్టీలో కొనసాగుతూ వచ్చారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో వలస నేతలతో  సీనియర్, ఉద్యమ నేతలకు పొసగకపోవడం.. ప్రజల్లో పార్టీపై వ్యతిరేకత, గతంతో పోల్చితే కాంగ్రెస్ గ్రాఫ్​ పెరగడం వంటి కారణాలతో కోవర్టు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. ఇదే ప్రస్తుతం ఎమ్మెల్యే అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

టీడీపీ ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌‌‌‌గా లేకపోవడంతో ఆ పార్టీ నుంచి వచ్చిన క్యాడర్ బీఆర్ఎస్‌‌‌‌లో సర్ధుకోగా, కాంగ్రెస్ పుంజుకుంటుండడంతో ఆ పార్టీ నుంచి వచ్చిన లీడర్లతో ఎమ్మెల్యే అభ్యర్థులు భయపడుతున్నారు. కొందరు ఇప్పటికే  మళ్లీ కాంగ్రెస్​లోకి వెళ్లగా.. మరికొందరు బీఆర్ఎస్‌‌‌‌లోనే కొనసాగుతున్నారు.  కాగా కాంగ్రెస్​ సైతం తిరిగి పార్టీలో చేరిన వారితో జాగ్రత్తగా ఉంటున్నట్లు సమాచారం. ఇన్నాళ్లు అధికార పార్టీలో కొనసాగడంతో తమ వ్యూహాలు ఆ పార్టీ లీడర్లకు చేరవేస్తారా అన్న కోణంలో కాంగ్రెస్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈక్రమంలో రెండు పార్టీల్లోని వలస లీడర్లపై ఎమ్మెల్యే అభ్యర్థులు ఓ కన్నేసి ఉంచుతున్నట్లు సమాచారం.