
- 16 జిల్లాల్లో 41 డిగ్రీలకు పైనే టెంపరేచర్లు
- రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్.. రెండు రోజులు ఇదే పరిస్థితి
- ఏప్రిల్ 2 నుంచి 4 రోజుల పాటు వర్షాలు
- ఏప్రిల్ 2న ఎల్లో.. 3న ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. టెంపరేచర్లు 41 డిగ్రీల మార్క్‌ను దాటేస్తున్నాయి. ఆదివారం 16 జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.అత్యధికంగా జగిత్యాల జిల్లా గోధూరులో41.5డిగ్రీలు రికార్డయింది. సాధారణం కంటే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే, వచ్చే రెండు రోజుల పాటు ఎండలు ముదిరినా.. ఆ తర్వాత వరుసగా 4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 2న రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, భద్రాద్రి జిల్లా భద్రాచలం, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండ, కరీంనగర్ జిల్లా గట్టుదుడ్డెనపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఆదివారం 41.4 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, జోగుళాంబ గద్వాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వనపర్తి, నిర్మల్, ఖమ్మం, నాగర్‌కర్నూల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో 41 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 నుంచి 40.8 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. ఒక్క జనగామ తప్ప అన్ని జిల్లాలూ ఆరెంజ్ అలర్ట్‌లోకి వెళ్లిపోయాయి. హైదరాబాద్‌లో ఆదివారం 40.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా.. మరో రెండు రోజులూ ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొన్నది.
3న వడగండ్ల వానలు పడే చాన్స్
వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 3వ తేదీన వడగండ్లు పడే అవకాశం ఉందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్తాయని వెల్లడించారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇష్యూ చేశారు.