
- జిల్లాలో సాధారణం కంటే సుమారు 3 డిగ్రీలు అధికం
- పెరుగనున్న కరెంట్ వినియోగం
- అడుగంటుతున్న భూగర్భ జలాలు
- యాసంగి సాగుపై జాగ్రత్తలు తీసుకోవాలంటున్న విద్యుత్ సిబ్బంది
- వరుస తడులు పెట్టుకుంటే మంచిదని సూచన
నిజామాబాద్, వెలుగు : వేసవి కాలం ఆరంభంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం రూ.10 దాటిందంటే ఎండ తీవ్రత పెరుగుతున్నది. శనివారం నిజామాబాద్జిల్లాలో 39 డిగ్రీలు ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 3 డిగ్రీలు అధికమైంది. రానున్న రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. గత పది రోజులుగా ఎండలు తీవ్రమవుతుండడంతో ఇండ్లు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల్లో కరెంట్ వినియోగం
పెరుగుతున్నది.
యాసంగి సాగుకు..
జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 5.20 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. అధికంగా 4.03 లక్షల్లో వరి పంటను సాగు చేశారు. జలాశయాలు, లిఫ్టుల కింద సాగైన పొలాలు పోను.. బోరుబావుల కింద 2.67 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో 1,83,709 లక్షల వ్యవసాయ బోర్లు ఉన్నాయి. కరెంట్ వినియోగం 4.10 మిలియన్ యూనిట్లు ఉండగా, రానున్న రోజుల్లో 6.0 మిలియన్ యూనిట్లకు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారుల అంచనా.
గృహ, కార్యాలయాలకూ..
జిల్లాలో 5,33,327 గృహాలకు కరెంట్ వినియోగిస్తుండగా, ప్రైవేట్ విద్యా సంస్థలు, హాస్పిటల్స్, బిజినెస్ షాప్‌లకు సంబంధించి 83,654 కనెక్షన్లు ఉన్నాయి. ఇండ్రస్ట్రియల్కు 4,909, ప్రభుత్వ ఆఫీస్‌లు, సర్కార్ స్కూల్స్, హాస్టల్స్ తదితర కనెక్షన్లు 14,908 ఉన్నాయి. మున్ముందు వేసవిలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధికంగా వాడే అవకాశం ఉన్నందున కరెంట్ వినియోగం పెరుగనున్నదని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు.
అడుగంటుతున్న భూగర్భ జలాలు..
ఎండలు తీవ్రమవుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. గడిచిన డిసెంబర్లో 8.92 మీటర్ల లోతులో ఉన్న గ్రౌండ్ వాటర్, ప్రస్తుతం నవీపేట, సిరికొండ మండలంలో 20 మీటర్ల లోతుకు గ్రౌండ్ వాటర్ వెళ్లింది. మోపాల్, వర్ని, బోధన్, కోటగిరి మండలాల్లో 15-20 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ ఉన్నది.
ఎడపల్లి, రుద్రూర్, నందిపేట, మాక్లూర్, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, కమ్మర్ పల్లి, డిచ్పల్లి, ధర్పల్లి, ఇందల్వాయి, మెండోరా, ఎర్గెట్ల, ముప్కాల్, వేల్పూర్, మోర్తాడ్, బాల్కొండ మండలాల్లో గరిష్ఠంగా 10 మీటర్ల లోతులో గ్రౌండ్ వాటర్ ఉంది. నిజాంసాగర్ నుంచి ఇప్పటివరకు వ్యవసాయానికి 5 టీఎంసీల నీటిని వినియోగించగా, ప్రాజెక్టులో 10 టీఎంసీల నీరు ఉన్నది. రైతులు వరుస తడులు పెట్టి నీటిని ఆదా చేయాలని వ్యవసాయ నిపుణులు
సూచిస్తున్నారు.
మున్ముందుగా వరి నాట్లు..
జిల్లాలో మున్ముందుగా వరి నాట్లు వేశారు. వ్యవసాయ బోర్లలో గ్రౌండ్ వాటర్ తగ్గుతున్నది. యాసంగి పంట చేతికి రావాలంటే వరుస తడులు పెట్టుకుంటే మంచిది. జిల్లాలోని ల్యాండ్ స్వభావం వల్ల సాగునీటి కొరత ఏర్పడదని భావిస్తున్నాం. – ప్రసాద్, ఏడీ, గ్రౌండ్ వాటర్
క్వాలిటీ కరెంట్ ఇస్తం
వ్యవసాయానికి కరెంట్ వినియోగం పెరుగనున్నది. రెండు నెలల్లో మరింత పెరుగుతుందని అంచనా. పంట కోతలు ముగిసేదాకా కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. విద్యుత్ లోపాలు లేకుండా నాణ్యమైన కరెంట్‌ను అందిస్తం. – రవీందర్, ఎస్ఈ, ఎన్పీడీసీఎల్