పేద వర్గాల యువత ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదకర పరిస్థితులు బలపడుతున్నాయి. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్య ప్రైవేటు పరమై వ్యాపారాత్మకమైన స్థితిలో వృత్తి విద్య ఎప్పుడో చెయ్యిజారింది. వైద్యం, ఇంజనీరింగ్, లా, సీఏ, ఫార్మసీ, కంప్యూటర్ తదితర వృత్తి కోర్సులన్నీ ఖరీదై కొండెక్కాయి. సాధారణ డిగ్రీ, పీజీ వంటి యూనివర్సిటీ కోర్సులతో సరిపెట్టుకుంటున్న పేద, అల్పాదాయ, బడుగు బలహీన వర్గాల యువతకు దాన్నీ దక్కనిచ్చేలా లేరు. ప్రభుత్వ యూనివర్సిటీలు రోజు రోజుకు కునారిల్లుతున్నాయి. పనిగట్టుకొని వాటిని నిర్వీర్యపరుస్తున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే ప్రైవేటు యూనివర్సిటీలతో డిగ్రీ, పీజీ చదువులు కూడా సామాన్యులకు కష్టమే! రిజర్వేషన్లు లేక, సీట్లు తేలిగ్గా దొరక్క ప్రతి కోర్సూ ఖరీదయ్యే వాస్తవం కళ్లకు కడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరే ఇందుకు ప్రధాన కారణం. సకాలంలో వైస్ చాన్స్లర్లను నియమించక, బోధన–బోధనేతర సిబ్బందిని అందించక, నిధులివ్వక వర్సిటీలను నెమ్మదిగా చంపేస్తున్నారు. పుష్కరకాలంగా సర్కారు నేరపూరిత నిర్లక్ష్యానికి తోడు యూనివర్సిటీ వ్యవహారాల్లో సర్కారు జోక్యం పెంచి, వాటి స్వయంప్రతిపత్తికి అడుగడుగునా గండికొడుతున్నారు. మరోపక్క ప్రైవేటు యూనివర్సిటీలకు యథేచ్ఛగా అనుమతులిస్తున్నారు. ముసుగొకటి తొడిగి ‘ఉన్నత విద్యలో నాణ్యత కోసమే’ అంటూ బుకాయిస్తున్నారు. అంటే, సర్కారు మాటలు–చేష్టల్ని బట్టి ప్రభుత్వం విద్యారంగంలో నాణ్యత అక్కర్లేదని స్వయంగా అంగీకరిస్తున్నట్టే లెక్క! మాటలకే తప్ప ప్రైవేటు యూనివర్సిటీల్లో విద్యా నాణ్యతకు గ్యారెంటీ ఏమీ లేదు. సర్కారు నుంచి సరైన నిఘా, నియంత్రణ లేని పద్ధతిలో, లాభార్జనే లక్ష్యంగా వస్తున్న ప్రైవేటు వర్సిటీల ప్రాబల్యం పెరగటం ఉన్నతవిద్యారంగం నడుములు ఇరగ్గొట్టే ఆఖరు సమ్మెట పోటు! దీనికి తోడు, రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు అన్ని వర్సిటీలకు గవర్నర్‌కు బదులు సీఎం కులపతి(చాన్స్‌లర్)గా ఉండేట్టు చట్టం వస్తే యూనివర్సిటీల స్వయంప్రతిపత్తి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టే! పౌరసమాజం అప్రమత్తం కావాల్సిన అత్యున్నత సమయమిదే!!
ఎట్నుంచి ఎటొచ్చాం?
పరోక్ష పెత్తనానికి ఓ యాబై ఏళ్ల కింద ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని నాటి సుప్రీంకోర్టు సమర్థంగా అడ్డుకుంది. స్వయంప్రతిపత్తి లేకుండా యూనివర్సిటీలు ఎలా పనిచేస్తాయి? జ్ఞానాన్ని ఎలా అందిస్తాయంటూ.. ‘ఎక్కడ మెదడు నిర్భయంగా పనిచేస్తుందో, తల ఎత్తుకొని జ్ఞానం స్వేచ్ఛగా పరివ్యాపితమౌతుందో.. ప్రతి సువిశాల ఆలోచన నికర చర్యల్లో ప్రతిఫలిస్తుందో.. ఆ స్వేచ్ఛా స్వర్గంలో తండ్రీ నా దేశాన్ని మేల్కొలిపి, వ్రయ్యలుగా చీలిపోని ప్రగతి వైపు నడిపించు’ అన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉటంకించింది. కాసు బ్రహ్మానందరెడ్డి సీఎంగా ‘కమిషనరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ ఏర్పాటు యత్నాన్ని ఉపాధ్యాయ సంఘాలు, పౌర సమాజం, రాజకీయ పక్షాలు గట్టిగా వ్యతిరేకించాయి. ఆ యత్నం అలా వీగిపోయింది. నికార్సయిన వీసీగా ఖ్యాతి గడించిన డీఎస్ రెడ్డి, విమానాశ్రయంలో తనకు తారసపడ్డ ప్రఖ్యాత ఆర్థికవేత్త గౌతమ్ మాథూర్‌తో పిచ్చాపాటి మాట్లాడుతూ, ‘మీరెందుకు మా యూనివర్సిటీలో పిల్లలకు పాఠాలు చెప్పకూడదు?’ అని అడిగి మరీ, ఆయన్ని బోధకుడిగా నియమిస్తారు. అలాంటి స్వేచ్ఛ–నిబద్ధత ఇవ్వాళ వీసీలకున్నాయా? అలాంటి వ్యక్తిని కూడా రాజకీయ కారణాలతో కాదని, తనకు నచ్చిన అర్హత గల మరో ప్రొఫెసర్‌ను గుంటూరు నుంచి తీసుకురావడానికి సాక్షాత్తూ నాటి ముఖ్యమంత్రి చేసిన ప్రయత్నమూ ఫలించలేదు. అది, యూనివర్సిటీ స్వయంప్రతిపత్తి బలం. మూడున్నర దశాబ్దాల కిందట, ఎన్టీరామారావు సీఎంగా ఉన్నపుడు యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిలోకి సర్కారు జోక్యానికి జరిగిన ప్రయత్నం కూడా ప్రతిఘటనతోనే బెడిసింది. యూనివర్సిటీ నిర్వహణలో కల్పించుకోమని, మరింత సమన్వయం– సహాయకారం కోసమేనని సుప్రీంకోర్టును సంతృప్తి పరచిన తర్వాతే, ప్రస్తుత ‘ఉన్నత విద్యా మండలి’ ఏర్పాటు సాధ్యమైంది. వర్సిటీలకు అప్పట్లో ఎంతో ప్రాధాన్యత, వాటి స్వయంప్రతిపత్తికి విలువ, వైస్ చాన్స్లర్లను ఎంపిక చేసే సెర్చ్ కమిటీకి ఓ నిబద్ధత, వీసీలకు ఇంటా బయటా ఎంతో గౌరవం ఉండేవి. అవి ఇప్పడు ఏవి? వీసీ పోస్టులు ఖాళీగా ఉంచి, ఇన్చార్జి పాలనాధికారులుగా ఐఏఎస్‌లు వచ్చాక వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టింది. పాలక మండలిలో ముగ్గురు ఐఏఎస్‌లు, ముఖ్యమంత్రే కులపతి అంటే ఇక వీసీలు నిర్భయంగా, స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి సున్నా! పాలకపక్షం కోరినట్టు వర్సిటీలు నడిచే స్థితి ఒకవైపు, ఫక్తు వ్యాపారపు ప్రైవేటు వర్సిటీల రాజ్యం మరోవైపు ఖాయం!.
రానున్నది దోపిడీ శకమే!
ఇబ్బడి ముబ్బడి ప్రైవేటు యూనివర్సిటీల అనుమతితో రాబోయేది దోపిడీ రాకాసి యుగమే! వైద్యం, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీయేల్లో ఏం జరిగిందో చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో 740 ఇంజనీరింగ్ కాలేజీలకు, 500కు పైగా కాలేజీల్లో సరైన ల్యాబ్‌లు, సౌలతులు, సిబ్బంది లేక కేవలం సర్కారు వారిచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుతో లాభాలార్జించిన చరిత్ర చూశాం. అక్కడ పట్టా పుచ్చుకున్న ‘ఇంజనీర్ల’ ఉద్యోగ యోగ్యత (ఎంప్లాయబిలిటీ) 17 శాతానికి తక్కువే! ఇప్పటికే అనుమతి పొందిన అయిదింట, 3 ప్రైవేటు యూనివర్సిటీలు పాలక టీఆర్ఎస్ నాయకులవే! మరో అయిదింటికి అనుమతిస్తున్నట్టు సాక్షాత్తు శాసనసభకు బిల్లు ద్వారా తెలిపారు. చాలా సన్నాహక స్థితిలో ఉన్నాయి. తమ ఉత్కృష్ట ఉత్పాదక కాలాన్ని సర్కారు యూనివర్సిటీల్లో వెచ్చించి, రిటైరైన ప్రొఫెసర్లను, నిపుణులను ఆయా ప్రైవేటు యూనివర్సిటీలు తమ హెడ్స్‌గా నియమించుకున్నాయి. మిగతా అంతా చో..చో! 25 శాతం సీట్లు స్థానికులకే అంటున్నా, ఆ స్థానికత అర్థరహితంగా ఉంది. ఇక్కడ రెండేండ్లు చదివిన వారైనా, రెండేళ్లు ఉన్నవారి పిల్లలైనా స్థానికులే అవుతారనటంతో దాని అర్థమే మారిపోయింది. ఇక సామాజిక రిజర్వేషన్లు లేవు. కోర్సుల ఫీజుల్ని మన ప్రభుత్వాలు నియంత్రించలేవు. ఇప్పటికే ఫేక్ సర్టిఫికెట్ల రాకెట్లు రాష్ట్రంలో యథేచ్చగా యువతను పెడదారి పట్టిస్తున్నాయి. రేపేంటో? సామాన్యులకు కష్టమొచ్చింది. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సర్కారు వర్సిటీలు సచ్చిపోయి, ప్రైవేటువి రెచ్చిపోయి ఉన్నత విద్యకు ఉరి పడటం ఖాయం!
ఆక్సిజన్ మాస్క్ తీసి...
ఎందుకన్నాడో కానీ, ఒక సందర్భంలో ప్రఖ్యాత రచయిత చలం, ‘మనిషి ఎవరినైనా క్షమిస్తాడు, ఒక్క తనకు సహాయపడ్డ వాడ్ని తప్ప’ అంటాడు. యూనివర్సిటీలు ఏం పాపం చేశాయని సర్కార్లు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నాయి. పన్నెండేండ్లుగా బోధన–బోధనేతర సిబ్బంది నియామకాలు లేవు. పార్ట్‌టైమ్ టీచర్లు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ టీచర్లతోనే పని జరిగిపోతున్నది. స్టాఫ్ లేక విద్యా బోధన కుంటుపడింది. హెచ్వోడీల్లేకుండా బ్యాచ్‌లే వెళ్లిపోతున్నాయి. ఒకటి, రెండేళ్లయితే ప్రస్తుత ప్రొఫెసర్లు చాలా మంది రిటైరవుతారు. రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచలేదు. కొన్ని కోర్సుల్ని బలవంతంగా రద్దు చేశారు. ఏళ్ల తరబడి వీసీలు లేకుండా వర్సిటీలు పనిచేశాయి. కోరిన, కావాల్సిన నిధులు ప్రభుత్వం ఇవ్వట్లేదు. ఓయూ ఈ ఏడాది రూ.789 కోట్లు అడిగితే 418 కోట్లు మంజూరు చేశారు. కాకతీయకు రూ.118 (300 కోరితే) కోట్లు, పాలమూరుకు రూ.9.85 కోట్లు(108) ఇలా అరకొర నిధులతో సరిపెడుతుంటే.. జీతాలు, అలవెన్సులకు కూడా కటకట తప్పట్లేదు. ఇదా యూనివర్సిటీలను నిర్వహించే పద్ధతి? ఒకప్పుడు ఎంతో రీసెర్చ్ జరిగేది. ఒక్క విద్యా విషయంలోనే కాకుండా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అధ్యయన కేంద్రాలుగా ఉండేవి. రాష్ట్ర–దేశ రాజకీయాల కోసం యువతకిక్కడ ఓనమాలు దిద్ది, పునాదులు వేసేది. దశాబ్దాల పాటు ఇటు ఓయూ, అటు కేయూ జ్ఙాన కేంద్రాలుగా విరాజిల్లిన స్వర్ణయుగం, నేడొక గతం! దేశ విదేశాల్లో పేరు ప్రఖ్యాతులుండేవి. ఇప్పుడు, కొడిగట్టిపోతున్న దీపాల్లా తయారయ్యాయి. నిబద్ధతలేని మెజారిటీ బోధకులు విద్యార్థుల మధ్య వర్గాల, కులాల కుంపట్లు రగిలించి పాఠాలు చెప్పే తమ శ్రమ తప్పించుకొని, యూజీసీ పెద్ద వేతనాలతో పబ్బం గడుపుకుంటున్నారు. డిగ్రీ పట్టా చేతికొస్తే చాలన్నట్టు విద్యార్థులు విధిలేక సరిపెట్టుకుంటున్న దైన్యస్థితి!
- దిలీప్ రెడ్డి.
dileepreddy.r@v6velugu.com