హైదరాబాద్, వెలుగు: ఓఆర్‌ఎస్‌ఎల్ పేరిట మార్కెట్‌లో లభ్యమవుతున్న నకిలీ ఓఆర్‌ఎస్‌లు తాగితే ప్రాణాలకు ముప్పు తప్పదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న లిక్విడ్ ఓఆర్‌ఎస్(ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్)లలో 90 శాతం నకిలీవేనని చెబుతున్నారు. ఎండాకాలం కావడంతో చాలా మంది రెగ్యులర్‌గా ఓఆర్‌ఎస్ లను తాగి హాస్పిటల్ పాలవుతున్నారని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శివరంజని వెల్లడించారు. నకిలీ ఓఆర్‌ఎస్‌లలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటాయన్నారు.
వీటిని డయాబెటీస్ పేషెంట్లు రెగ్యులర్‌గా తీసుకుంటే షుగర్ లెవల్స్ ఎక్కువై ప్రాణాపాయం కలగవచ్చని చెప్పారు. ‘‘బ్లడ్ షుగర్‌ను ఇన్సులిన్ ఎనర్జీగా మారుస్తుంది. షుగర్ లెవల్స్ పెరిగినప్పుడు ఎక్కువ ఇన్సులిన్ అవసరం అవుతుంది. కానీ, డయాబెటీస్ పేషెంట్లలో ఇన్సూలిన్ ఉత్పత్తి సరిపోక, షుగర్ లెవల్స్ ఒక్కసారిగా ఎక్కువైపోతాయి. నకిలీ ఓఆర్‌ఎస్ తీసుకున్నప్పుడు ఇదే జరుగుతోంది. ఓ వైపు షుగర్ లెవల్స్ పెరగడంతో పాటు, మరోవైపు డీహైడ్రేషన్‌కు గురవుతున్నారు”అని డాక్టర్ విజయేందర్ వివరించారు.
డీహైడ్రేషన్ ఎఫెక్ట్
ఎండాకాలంలో వడ దెబ్బ బారిన పడకూడదన్న ముందు జాగ్రత్తతో చాలా మంది ఓఆర్‌ఎస్ తాగుతారు. కానీ దాని వల్లే డీహైడ్రేషన్ బారిన పడుతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. నకిలీ ఓఆర్‌ఎస్‌లు బ్లడ్ సెల్స్ నుంచి వాటర్‌ను బయటకు తీసి రక్తనాళాల్లోకి పంపిస్తాయని డాక్టర్ శివరంజని వివరించారు. దీనివల్ల ఒంట్లో ఉన్న వాటర్ యూరిన్ రూపంలో బయటకు పోయి డీహైడ్రేషన్ అవుతుందన్నారు. డయేరియా బారిన పడిన పిల్లలకు కూడా తల్లిదండ్రులు లిక్విడ్ ఓఆర్‌ఎస్‌ల పేరిట మార్కెట్‌లో ఉన్న నకిలీ ఓఆర్‌ఎస్‌లను తాగిస్తున్నారని, దీని వల్ల పిల్లల పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పారు. డీహైడ్రేషన్ ఎవరికైనా చాలా ప్రమాదమేనని, డయబెటీస్ పేషెంట్లకు మరింత ప్రమాదమని డాక్టర్ విజయేందర్ హెచ్చరించారు. డబ్ల్యూహెచ్‌వో ఫార్ములా ప్రకారం తయారు చేసిన ఓఆర్‌ఎస్ తాగడం వల్ల డీహైడ్రేషన్ అవ్వదని పేర్కొన్నారు.
డబ్ల్యూహెచ్‌వో రికమెండెడ్‌వి మాత్రమే తాగండి
షుగర్ ఉన్నవాళ్లు వేసవి కాలంలో లిక్విడ్ ఓఆర్‌ఎస్ డ్రింక్స్ డబ్బాల మీద డబ్బాలు కొని తాగేస్తున్నారు. అవి తమకు డీహైడ్రేషన్ అవ్వకుండా నీరసం రాకుండా కాపాడుతాయని అపోహ పడుతున్నారు. కానీ, ఈ డ్రింక్స్‌లో ఉన్న అధిక చక్కర శాతం వల్ల మన సెల్స్‌లో నుంచి నీరు రక్తనాళాల్లోకి వచ్చి, మూత్రం(యూరిన్) లాగా వెళ్లిపోతుంది. దీని వల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేషన్ అయ్యి నీరసం వచ్చేస్తుంది. ఇది చాల ప్రమాదకరం. షుగర్ ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువ ప్రమాదకరం. ఓఆర్‌ఎస్ అనుకుని నకిలీ డ్రింక్స్ తాగొద్దు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రెకమెండెడ్ ఫార్ములా ఓఆర్‌ఎస్ అని రాసి ఉంటేనే అది నిజమైన ఓఆర్‌ఎస్. అది మాత్రమే తీసుకోవాలి. దాని వల్ల నష్టం ఏమీ ఉండదు.
- డాక్టర్ శివరంజని సంతోష్, హైదరాబాద్