ఛత్తీస్‎గఢ్‎లో మరో దారుణం.. జర్నలిస్ట్ ఫ్యామిలీని నరికి చంపిన ప్రత్యర్థులు

రాయ్‎పూర్: ఛత్తీస్ గఢ్‎లో మరో దారుణం జరిగింది. అవినీతిని వెలికి తీశాడన్న కోపంతో ఇటీవల ఓ జర్నలిస్టును కిరాతకంగా హత్య చేసిన ఘటన మరుకవముందే.. తాజాగా మరో జర్నలిస్టు ఫ్యామిలీపై దాడి చేసి హతమార్చారు దుండగులు. పోలీసుల వివరాల ప్రకారం.. సూరజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ ఓ మీడియా ఛానెల్‎లో జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. సంతోష్ ఫ్యామిలీకి జగన్నాథ్‌పూర్ ప్రాంతంలో కొంత భూమి ఉండగా.. ఈ ల్యాండ్‎కు సంబంధించి కొన్నాళ్లుగా కుటుంబ కలహాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ భూ వివాదం కోర్టు పరిధిలో ఉంది. 

శుక్రవారం (జనవరి 10) ఈ వివాదస్పద భూమి దగ్గరికి సంతోష్‌ తల్లిదండ్రులు మాఘే తోప్పో (57), బసంతి టోప్పో (55), సోదరుడు నరేష్‌ టోప్పో (30) వెళ్లారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ప్రత్యర్థులు సంతోష్ కుమార్ ఫ్యామిలీ మెంబర్స్‎పై గొడ్డళ్లు, కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సంతోష్ తల్లి బసంతి, సోదరుడి తలకు తీవ్రంగా గాయాలు కావడంతో వారు స్పాట్‎లోనే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన మాఘేను అంబికాపూర్ మెడికల్ కాలేజీకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంతోష్ మరో సోదరుడు ఉమేష్ టోప్పో ఈ దాడి నుంచి తప్పించుకుని గ్రామస్థులకు ఈ విషయం చెప్పాడు. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వెళ్లే లోపే నిందితులు పారిపోయారు. సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేపట్టినట్లు ప్రతాప్‎పూర్ పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టామన్నారు. వివాదస్పదమైన ఈ భూమికి సంబంధించి కోర్టు తీర్పు ఇవ్వకముందే సంతోష్ కుటుంబపై దాడి చేసిన వారు వ్యవసాయం చేయడంతోనే ఘర్షణలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.