ప్రాణహిత బ్యాక్ వాటర్‌‌తో నీట మునిగిన పంట పొలాలు

ప్రాణహిత బ్యాక్ వాటర్‌‌తో నీట మునిగిన పంట పొలాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాజెక్టులు నీటితో కళకళలాడుతున్నాయి. ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉండగా ప్రస్తుతం 697.225 అడుగులుగా ఉంది. ఇన్ ఫ్లో 3585 క్యూసెక్కులు ఉంటే ఔట్ ఫ్లో 250 క్యూసెక్కులుగా ఉంది. ఇక కొమురంభీం జిల్లా బెజ్జూర్‌ మండలంలోని తలాయి వద్ద ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ తో  తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. ఈ ఏడాది ప్రాణహిత బ్యాక్ వాటర్ తో మూడో సారి పంట పొలాలు నీట మునిగాయి.

చింతలమానేపల్లి మండలంలోని దిందా వద్ద ప్రాణహిత బ్యాక్ వాటర్ తో వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో దిందా గ్రామం జలదిగ్భందంలో చిక్కుకుంది. దిందాలో గ్రామస్తుల దీక్ష మూడో రోజు కంటిన్యూ అవుతోంది. వాగుపై వంతెన, రోడ్డు నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఫ్లకార్డులు పట్టుకుని గ్రామస్తుల దీక్ష చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ ఫ్లో- 9829 క్యూసెక్కులుగా ఉంటే.. ఔట్ ఫ్లో- 13940 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం- 29.917 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుత నీటి మట్టం 29.320 టీఎంసీలుగా ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.