ఆసిఫాబాద్ వెలుగు: వానలకు ఉప్పొంగిన వాగులు ఇంకా జనాలను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. ప్రమాదమని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ఉప్పొంగుతున్న వాగులను దాటుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం లక్మాపూర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
అయితే, గ్రామానికి చెందిన రాథోర్రవి అనే యువకుడు ఓ పసికందును ఎత్తుకొని వాగు దాటించాడు. మరికొందరు ఓ యువతిని భుజాలపై ఎత్తుకొని వాగు దాటించారు. ఈ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి అసంపూర్తిగా ఉండటంతో గ్రామస్తులు ప్రమాదకరంగా వాగు దాటుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తిచేసి తమ కష్టాలు తీర్చాలని కోరుతున్నారు.