SL vs IND 3rd ODI: పరాగ్ డబుల్ బ్రేక్.. వరుస ఓవర్లలో వికెట్లు

కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు రియాన్ పరాగ్ కు చోటు దక్కింది. తొలి రెండు వన్డేల్లో బెంచ్ కు కే పరిమితమైన పరాగ్ ఎట్టకేలకు ప్లేయింగ్ 11 లో స్థానం దక్కించుకున్నాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ లో వన్డే అరంగేట్రం చేశాడు. ఆడుతున్న తొలి మ్యాచ్ లోనే సత్త చాటాడు. ఆతిధ్య శ్రీలంకకు ఊహించని షాక్ ఇచ్చి భారీ స్కోర్ వెళ్లకుండా చేశాడు. వరుస ఓవర్లలో వికెట్ తీసి జోరు మీదున్న లంక బ్యాటర్లకు చెక్ పెట్టాడు.

ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తొలి వికెట్ కు 89 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కు 82 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. ఈ దశలో పార్ట్ టైం స్పిన్నర్ రియాన్ పరాగ్ మ్యాజికి చేశాడు. సెంచరీ దిశగా దూసుకెళ్తున్న ఫెర్నాండో వికెట్ తీసి భారత్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇదే ఊపులో 38 ఓవర్లో శ్రీలంక కెప్టెన్ అసలంక (10)ను పెవిలియన్ కు చేర్చాడు. 

పార్ట్ టైం బౌలర్ గా జట్టులోకి చేరి భారత జట్టును ఆదుకున్నాడు. టీ20 ల్లో పరాగ్ తన స్పిన్ తో ఆకట్టుకున్నాడు. ఈ యువ బౌలర్ వరుస ఓవర్లలో వికెట్ తీయడంతో శ్రీలంక పతనం దిశగా వెళ్తుంది. వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక జట్టు.. 199 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం శ్రీలంక 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పరాగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు.