SL vs IND 3rd ODI: అరంగేట్ర మ్యాచ్‌లో పరాగ్ మ్యాజిక్.. తక్కువ స్కోర్‌కే పరిమితమైన శ్రీలంక

వన్డే సిరీస్ లో శ్రీలంకపై జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో భారత బౌలర్లు తడబడి పుంజుకున్నారు. టాపార్డర్ వికెట్ తీయడంలో విఫలమైనా పరాగ్ ఇచ్చిన బ్రేక్ తో భారత్ దూసుకెళ్లింది. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.  ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో 96 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. భారత బౌలర్లలో పరాగ్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. 

ఈ మ్యాచ్ లో ఈ మ్యాచ్ లో శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు తొలి వికెట్ కు 89 పరుగులు జోడించి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. నిఫామ్ లో ఉన్న నిస్సంకా (45) ను అక్షర్ పటేల్ పెవిలియన్ కు చేర్చాడు. ఆ తర్వాత ఓపెనర్ ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండీస్ భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో వికెట్ కు 82 పరుగులు జోడించి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. ఈ దశలో పార్ట్ టైం స్పిన్నర్ రియాన్ పరాగ్ మ్యాజిక్ చేశాడు. 

వరుస ఓవర్లలో వికెట్లను తీసి భారత్ కు డబుల్ బ్రేక్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి భారత బౌలర్లు అదరగొట్టారు. వరుస విరామాల్లో వికెట్లను తీస్తూ లంక జోరుకు కళ్లెం వేశారు. ఒక దశలో వికెట్ నష్టానికి 171 పరుగులు చేసి పటిష్టంగా కనిపించిన లంక జట్టు.. 199 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయి దిక్కుతోచని స్థితిలో నిలిచింది. కుశాల్ మెండీస్ హాఫ్ సెంచరీతో ఆడుకోవడంతో శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 248 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో రియాన్ పరాగ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. సిరాజ్, అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్ లకు తలో వికెట్ దక్కింది.