IPL 2025: 64 బంతుల్లోనే 144.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం

IPL 2025: 64 బంతుల్లోనే 144.. దంచికొట్టిన రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం

ఐపీఎల్ కు ముందు అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ లతో బిజీగా మారిపోయాయి. ప్రతి జట్టులోని కొంతమంది ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్ లో తమ విధ్వంసాన్ని చూపించారు. ఇందులోకి భాగంగా రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ రియాన్ పరాగ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మెరుపు సెంచరీతో వీర విహారం చేశాడు. కేవలం 64 బంతుల్లో పరాగ్ 10 సిక్సర్లు, 16 ఫోర్లతో 144 పరుగులతో అజేయంగా నిలిచాడు. సీజన్ కు ముందు పరాగ్ ప్రాక్టీస్ లో చూపించిన ఈ ఫామ్ రాయల్స్ శిబిరంలో ఆనందాన్ని కలిగిస్తుంది. 

2023 ఐపీఎల్‌లో పరాగ్ ఏడు మ్యాచ్‌ల్లో కేవలం 78 పరుగులు మాత్రమే చేసి విమర్శలకు గురయ్యాడు. అయితే 2024 ఐపీఎల్ సీజన్‌లో పరాగ్ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చాడు. నాలుగు హాఫ్ సెంచరీలతో 16 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేశాడు. పరాగ్ ప్రదర్శనకు గుర్తింపు దక్కింది. ఈ యువ బ్యాటర్ ను ఐపీఎల్ మెగా ఆక్షన్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ రూ.14 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. మిడిల్ ఆర్డర్ లో పరాగ్ పై రాజస్థాన్ రాయల్స్ భారీగా ఆశలు పెట్టుకుంది. 

పరాగ్ ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. తొలి మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజు శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తాడని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. సంజు శాంసన్ ఇంకా కోలుకోకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. మార్చి 23న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాజస్థాన్ రాయల్స్ తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది.