జింబాబ్వే టూర్‌కు ఐపీఎల్ వీరులు.. ఆ ఇద్దరికీ చోటు కన్ఫర్మ్

జింబాబ్వే టూర్‌కు ఐపీఎల్ వీరులు.. ఆ ఇద్దరికీ చోటు కన్ఫర్మ్

టీమిండియా ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతూ బిజీగా ఉంది. ఈ మెగా లీగ్ తర్వాత భారత క్రికెట్ జట్టు జింబాబ్వేలో అడుగుపెట్టనుంది. ఈ టూర్ లో భాగంగా భారత్ మొత్తం 5 టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. జూలై 6 నుండి 14 వరకు ఈ సిరీస్ జరుగుతుంది. మొత్తం ఐదు టీ20లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జూలై 6,7,10,13,14 తేదీల్లో జరుగుతాయి. ఈ సిరీస్ కోసం భారత్ సీనియర్లకు రెస్ట్ ఇచ్చి బి టీంను పంపనుందని నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్ లో సత్తా చాటిన రియాన్ పరాగ్, వెంకటేష్ అయ్యర్ ఈ టూర్ కు ఎంపిక కానున్నారని సమాచారం.

ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున రియాన్ పరాగ్ అద్భుత ఆటతీరును ప్రదర్శించాడు. 15 మ్యాచ్‌ల్లో 573 పరుగులు చేసి సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆప్స్ కు చేరుకోవడంలో పరాగ్ కీలక పాత్ర పోషించాడు. అతని యావరేజ్ 52.09 ఉంటే.. స్ట్రైక్ రేట్ 149. మరోవైపు కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ 14 మ్యాచ్‌లలో 46.25 సగటుతో 370 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 158.80 గా ఉంది.  

8 ఏళ్ల తర్వాత జింబాబ్వేలో భారత్‌ పర్యటించడం ఇదే తొలిసారి. చివరి సారిగా 2016లో సిరీస్ ఆడగా భారత్ 2-0 తేడాతో సిరీస్ గెలిచింది. ఇప్పటివరకు మూడు సార్లు జింబాబ్వే పర్యటనకు వెళ్లిన మన క్రికెట్ జట్టు.. రెండు సార్లు సిరీస్ గెలిచింది. 2015 లో జరిగిన సిరీస్ 1-1 తో డ్రాగా ముగిసింది. ఇక్కడ మొత్తం 7 టీ20 మ్యాచ్ లాడగా.. 5 టీ20ల్లో విజయం సాధించింది. మరో రెండు టీ20 ల్లో ఓటమి పాలైంది.