IPL 2024: ఒక్కడే వారియర్‌లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్

IPL 2024: ఒక్కడే వారియర్‌లా: పరాగ్ ఒంటరి పోరాటంతో రాజస్థాన్ భారీ స్కోర్

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తడబడి నిలబడింది. జైపూర్ వేదికగా సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ బ్యాటర్ పరాగ్ చెలరేగి ఆడడంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. మొదట్లో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినా రియాన్ పరాగ్(84) ఒంటరి పోరాటానికి తోడు అశ్విన్, జురెల్, హెట్ మేయర్ సహకరించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు మంచి ఆరంభం లభించలేదు. పవర్ ప్లే లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ జైస్వాల్ (5), సంజు శాంసన్ (15) తక్కువ స్కోర్ కే ఔటయ్యారు. ఆదుకుంటాడుకున్న బట్లర్ 16 బంతుల్లో ఒక్క ఫోర్ కూడా కొట్టకుండా 11 పరుగులు చేసి నిష్క్రమించాడు. దీంతో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన రాజస్థాన్ ను అశ్విన్, పరాగ్ జోడి ఆదుకుంది. ముఖ్యంగా అశ్విన్ సిక్సులతో రెచ్చిపోయాడు.

29 పరుగులు చేసి అశ్విన్ ఔటైన తర్వాత పరాగ్ తనలోని విశ్వ రూపం చూపించాడు.  జురెల్, హెట్ మేయర్ తో కలిసి వారియర్ లా పోరాడాడు. ఫోర్లు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. 45 బంతుల్లో 6 సిక్సులు, 7 ఫోర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పరాగ్ ధాటికి చివరి ఓవర్లో ఏకంగా 25 పరుగులు వచ్చాయి. హెట్ మేయర్ 7 బంతుల్లో 14 పరుగులు చేస్తే.. జుర్ల్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో ఖలీద్, నోకియా, కుల్దీప్, ముఖేష్, అక్షర్ తలో వికెట్ తీసుకున్నారు.