NZ vs PAK, 3rd T20I: బ్యాట్ లేకుండానే పరుగు..అడ్డంగా దొరికిపోయిన పాక్ వికెట్ కీపర్

NZ vs PAK, 3rd T20I: బ్యాట్ లేకుండానే పరుగు..అడ్డంగా దొరికిపోయిన పాక్ వికెట్ కీపర్

పాకిస్థాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ గ్రౌండ్ లో విచిత్ర వేషాలు వేయడంలో దిట్ట. ఓవర్ గా రియాక్ట్ అవుతూ కెమెరాను తవైపుకు తిప్పుకుంటాడు. పదే, పదే గ్రౌండ్ లో కింద పడిపోవడం.. కీపింగ్ చేస్తున్నప్పుడు ఔట్ కాదని తెలిసినా అప్పీల్ చేయడం..ప్రత్యర్దులతో సరదాగా మాట్లాడటం లాంటివి ఈ పాక్ వికెట్ కీపర్ కు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా అలాంటి విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. 

డునిడైడ్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడో టీ20 రిజ్వాన్ చేసిన పని వైరల్ అవుతుంది. పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో హెన్రీ వేసిన ఐదో బంతిని మిడ్ వికెట్ మీదగా ఆడిన రిజ్వాన్. ఒక పరుగు పూర్తి చేసుకున్నాడు. అయితే రెండో పరుగు వేగంగా తీసే క్రమంలో బ్యాట్ఈ జారీ కిందపడింది. చేతిలో బ్యాట్ లేకపోయినప్పటికీ ఈ వికెట్ కీపర్ రన్ కోసం ప్రయత్నించాడు. మరో పరుగు తీసుకునే ముందు నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో అతని గ్లవ్స్ ను క్రీజులో పెట్టడంలో విఫలమయ్యాడు. దీంతో ఒక్క పరుగు మాత్రమే లభించింది.

ఈ మ్యాచ్ లో రిజ్వాన్ 20 బంతుల్లో 2 సిక్సర్లతో 24 పరుగులు చేసి సాంట్నర్ బౌలింగ్ లో  ఔట్ కాగా..కివీస్ ఓపెనర్ అలెన్ పెను విధ్వంసానికి పాక్ 45 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన న్యూజి లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. అలెన్ ఒక్కడే 137 పరుగులు చేసాడు. ఇక లక్ష్య ఛేదనలో పాకిస్థాన్  7 వికెట్లకు 179 పరుగులకే పరిమితమైంది. బాబర్ అజామ్ 37 బంతుల్లో 57 పరుగులు చేసినా లక్ష్యం మరీ భారీగా ఉండడంతో పాక్ కు పరాజయం తప్పలేదు. ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 జనవరి 19 న జరుగుతుంది.