- మరోసారి నార్సింగి పీఎస్‌కు లావణ్య
- ఆర్జే శేఖర్ బాషా, మస్తాన్ సాయిపై ఫిర్యాదు
గండిపేట, వెలుగు: మస్తాన్ సాయి కేసు కొత్త మలుపు తిరుగుతున్నది. అనేక మంది యువతులు, వివాహితలకు అతను డ్రగ్స్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడని లావణ్య సోమవారం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. తన అడ్వొకేట్‌తో కలిసి మంగళవారం మరోసారి నార్సింగి పీఎస్‌కు ఆమె వచ్చింది. గతంలో తనపై నమోదైన డ్రగ్స్ కేసులో పోలీసులకు వివరణ ఇచ్చింది. మస్తాన్ సాయి స్నేహితుడు శేఖర్ బాషాపై ఫిర్యాదు చేసింది.
డ్రగ్స్ కేసులో తనను ఇరికించేందుకు వీరిద్దరూ యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆడియో ఆధారాలను పోలీసులకు అందజేశారు. మస్తాన్ సాయి గతంలో హైదరాబాద్, విజయవాడలో నమోదైన డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. సినీ నటుడు రాజ్ తరుణ్ తనను పెళ్లి పేరిట మోసగించాడని లావణ్య గతంలో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వివాదంలోనే మస్తాన్‌సాయి వ్యవహారం బయటకొచ్చింది. లావణ్య రెండు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు.