లాలూ ఆరోగ్యం సీరియస్ : పాట్నా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు

లాలూ ఆరోగ్యం సీరియస్ : పాట్నా ఆస్పత్రికి కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు

ఆర్జేడీ చీఫ్.. బీహార్ రాష్ట్ర సీనియర్ పొలిటికల్ లీడర్.. మాజీ కేంద్ర మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న లాలూ.. 2025, ఏప్రిల్ 2వ తేదీ ఉదయం ఇంట్లోనే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే పాట్నాలోని పరాస్ ఆస్పత్రికి తరలించారు. ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న లాలూ.. వయస్సుతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 

లాలూను ఆస్పత్రిలో చేర్పించిన తర్వాత.. కొన్ని గంటల తర్వాత.. ఆర్జేడీ నేత, లాలూ భార్య, మాజీ సీఎం రబ్రీ దేవితోపాటు ఇతర కుటుంబ సభ్యులు అందరూ హడావిడిగా ఆస్పత్రికి తరలి రావటం కనిపించింది. లాలూకు షుగర్ లెవల్స్ విపరీతంగా పెరిగాయని.. దీని వల్ల ఆరోగ్యం సీరియస్ అయ్యిందని పరాస్ ఆస్పత్రి డాక్టర్లు చెబుతున్నారు.

లాలూకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మెరుగైన వైద్యం అవసరం అయిన.. ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించే అవకాశం ఉన్నట్లు ఆర్జేడీ పార్టీ వర్గాలు చెబుతున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీని కోసం ఎయిర్ అంబులెన్స్ సిద్ధం చేస్తున్నట్లు కూడా చెబుతున్నారు. ఎయిర్ అంబులెన్స్ ద్వారా లాలూను ఢిల్లీకి తరలిస్తున్నారనే వార్తలు రావటంతో.. పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి దగ్గరకు తరలి వస్తున్నారు. 

పదేళ్లుగా లాలూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గత ఏడాది ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ లో యాంజియోప్లాస్టీ జరిగింది. అంతకు ముందు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశారు. కుమార్తె రోహిణినే తండ్రి లాలూకు కిడ్నీ దానం చేశారు. ఈ ఆపరేషన్ సింగపూర్ లో జరిగింది. 

లాలూ ఆరోగ్యం ఇప్పుడు మరింత క్షీణించిందనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై పార్టీ వర్గాలు, లాలూ కుటుంబ సభ్యులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు..