బీహార్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంగేర్ జిల్లాలోని ఎయిర్‌పోర్ట్ గ్రౌండ్‌లో మార్నింగ్ వాక్ చేస్తున్న RJD నాయకుడు పంకజ్ యాదవ్‌పై ఇద్దరు యువకులు తుపాకితో కాల్పులు జరిపారు. ఇద్దరు యువకులు బైక్ పై వచ్చి మార్నింగ్ వాక్ చేస్తున్న పంకజ్ యాదవ్ ని షూట్ చేశారు. పంకజ్ యాదవ్ పై మూడుసార్లు కాల్పులు చేశారు. వాటిలో ఓ బులెట్ అతని ఛాతీకి తగిలింది. అతడిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు బుల్లెట్లను బయటకు తీశారు. అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలకు ఏం ప్రమాదం లేదని సమాచారం.
స్థానికులు ఇచ్చిన వివరాలతో దాడి చేసింది మిథు యాదవ్, నమన్ యాదవ్ లుగా పోలీసులు గుర్తించారు. కాల్పుల అనంతరం అక్కడి నుంచి వారిద్దరు బైక్ పై పారిపోయారు. అక్కడే ఉన్న కొందరు ఆయన్ని హాస్పిటల్ లో చేర్పించారు. పోలీసులు విచారించి నిందితుల కోసం గాలిస్తున్నారు. క్రిమినల్ సావన్ యాదవ్‌తో సంబంధం ఉన్న మిథు యాదవ్‌తో సహా కొంతమంది అనుమానితుల పేర్లను ప్రాథమిక దర్యాప్తులో బయటకు వచ్చాయి. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హింసాత్మక ఘటనలకు బీహార్ ప్రభుత్వమే కారణమని ఆర్జేడీ నేతలు విమర్శించారు.