అద్వితీయ నేత శరద్​యాదవ్​

మండల్​ యోధుడు శరద్​యాదవ్​తన 75వ ఏట మొన్న జనవరి 12న ఢిల్లీలో కన్నుమూశారు. భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అంబేద్కర్ తర్వాత అత్యంత స్థిరమైన కుల వ్యతిరేక భావజాలం కలిగిన ఓబీసీ నాయకుడు శరద్​యాదవ్. ఆయన లోహియా సోషలిస్ట్ ఉద్యమంలో పెరిగినప్పటికీ, తన సొంత ఐడియాలజీతో చిన్న వయసు నుంచే కుల వ్యతిరేక భావజాలాన్ని బలంగా వినిపిస్తూ దీర్ఘకాలిక పార్లమెంటేరియన్​గా నిలిచారు. 27 ఏండ్లకే పార్లమెంట్​సభ్యుడైన శరద్​యాదవ్..​ చట్టసభ, బయట అణగారిన కులాల పక్షాన పోరాడారు. ఓబీసీ పాలసీల రూపకల్పనలో తన జీవిత కాలం వెచ్చించారు. దేశంలో 1990 నాటి మండల్ అనుకూల, వ్యతిరేక పోరాటాలు సమయంలో శరద్ యాదవ్ పాత్రను ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం వ్యతిరేకించడం వల్ల మండల్ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌కు మద్దతు ఇస్తున్న వారు నిస్సహాయంగా ఉన్న పరిస్థితి. మండల్ కమిషన్ నివేదిక అమలును కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకించాయి. నాటి మండల్​స్ఫూర్తితో నేడు అత్యధికంగా లబ్ధి పొందుతున్న నరేంద్రమోడీ లాంటి నాయకులు అప్పట్లో ఎక్కడా కనిపించలేదు. అరుణ్ శౌరీ లాంటి హార్డ్‌‌‌‌‌‌‌‌కోర్ రిజర్వేషన్ వ్యతిరేక శక్తులు జాతీయ మీడియా(ఇంగ్లీష్, హిందీల)ను నియంత్రించాయి. అగ్రవర్ణ యువకులతో హింసను ప్రేరేపించాయి.

ధైర్యం గల నాయకుడు

వీపీ సింగ్ ​ప్రభుత్వంలో ‘ఓబీసీ – మండల్’ అనుకూల ఏకైక ధైర్యం గల మంత్రి శరద్​యాదవ్​ఒక్కరే. ఓబీసీ రిజర్వేషన్ల యుద్ధంలో ఆయన ధైర్యంగా నిలిచారు. ప్రధానమంత్రిగా వీపీ సింగ్ సేఫ్​జోన్​ను వెతుక్కోగా, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ ముఖ్యమంత్రులుగా ఉండి రాష్ట్రాలకే పరిమితమయ్యారు. ఆ చారిత్రాత్మక యుద్ధంలో పార్లమెంటు లోపల, వెలుపల మండల్​ వ్యతిరేకతను ధీటుగా ఎదుర్కొన్న ఏకైక ఓబీసీ నాయకుడు శరద్ యాదవ్. ఎలాగోలా.. మండల్ వ్యతిరేక శక్తులను ఓడించడం ద్వారా మండల్ రిజర్వేషన్ స్థిరీకరించబడుతున్న సమయంలో, ఆర్​ఎస్​ఎస్​/బీజేపీ వర్గాలు ‘మందిర్ – మసీదు’ రథయాత్రను ప్రారంభించాయి. ఆ తర్వాత ‘మండల్ వర్సెస్ కమండల్’ మధ్య పోరు జరుగుతుందని శరద్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆయన ఢిల్లీలో బలగాలను సమీకరించగా, ములాయం సింగ్, లాలూ ప్రసాద్ యూపీ, బీహార్‌‌‌‌‌‌‌‌ల సీఎంలుగా వారి రాష్ట్రాల్లో ఆ పని చేశారు. 

లోహియా నుంచి అంబేద్కర్ వరకు

శరద్​యాదవ్ రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్ అనుచరుడిగా ప్రారంభమైనప్పటికీ, చివరి రోజుల్లో ఆయన అంబేద్కర్, -పూలే అనుచరుడిగా మారారు. 1990లో ఢిల్లీలోని ప్రధానమంత్రి ఇల్లు, కార్యాలయంలో ఆయన పోషించిన కీలక పాత్ర మండల్ విప్లవం సామాజిక మార్పునకు కారణమైంది. క్యాబినెట్​మంత్రిగా శరద్​యాదవ్​ పట్టుబట్టడంతో 1990 ఆగస్టు 6న మండల్ కమిషన్ సిఫార్సుల అమలుపై చర్చించే ప్రధాన ఎజెండాతో,  వీపీ సింగ్ తన ఇంట్లో సాయంత్రం 6 గంటలకు క్యాబినెట్ భేటీ నిర్వహించాడు. ఆ మరుసటి రోజు ప్రభుత్వం మండల్ కమిషన్ సిఫార్సులను ఆమోదించింది. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని ప్రకటించింది. ఆ సమయంలో శరద్​యాదవ్​ మాట ప్రకారం.. వీపీ సింగ్ మండల్ నివేదికను అమలు చేయకపోతే, దేవిలాల్ అతని ప్రభుత్వాన్ని రోజుల వ్యవధిలోనే కూల్చేవాడు. మళ్లీ ఎన్నికలు జరిగేవి. మండల్​నివేదిక సమాధి అయ్యేది. పార్లమెంటులో ఆయన వ్యక్తిత్వం అద్వితీయమైనది. ఆయన మాట్లాడినప్పుడు ప్రత్యర్థులు కూడా ఎంతో జాగ్రత్తగా వినేవారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో సామాజిక మార్పునకు నాంది పలికిన వ్యక్తిగా శరద్​యాదవ్​చిరస్మరణీయులయ్యారు.

ఒకే ఒక్క ఆశా కిరణం

ఉత్పాదక శూద్ర, దళిత, ఆదివాసి ప్రజానీకాన్ని అవమానిస్తున్న మండల్ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా సైద్ధాంతిక శక్తిగా పోరాడుతున్న ఏకైక ఆశా కిరణంగా శరద్​యాదవ్​కనిపించారు. ఆ యుద్ధభూమిలోనే ఆయనపై నాకు అభిమానం ఏర్పడింది. కానీ 2017 వరకు నేను ఆయనను కలువలేదు. 2017లో ఢిల్లీ కార్యాలయంలో ఆయనను కలిశాను. ఆయన ఆఫీసులో పెద్ద బుద్ధ విగ్రహం, కార్ల్ మార్క్స్, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫొటోలు కనిపించాయి. నా హిందీ పుస్తకం ‘హిందుత్వ ముక్త భారత్’ని ఇంగ్లీష్​లో విడుదల చేయాలని నేను ఆయనను కోరాను. దానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. 2017 జులై 10న జేఎన్​యూ ఆడిటోరియంలో బుక్​ రిలీజ్​చేశారు.   నా ఫ్రెండ్ ​ట్రూత్ సీకర్స్ ఇంటర్నేషనల్ అధినేత సునీల్ సర్దార్.. శరద్ యాదవ్‌‌‌‌‌‌‌‌కు మంచి స్నేహితుడు. నా ఫ్రెండ్​తో కలిసి నేను చాలా సార్లు శరద్​యాదవ్​ను కలిశాను. సామాజిక పరివర్తన, సమానత్వం పట్ల ఆయనకు నిబద్ధత ఎమర్జెన్సీ తర్వాత అంతగా కనిపించలేదు. అదే ఏడాది పూణేలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లైఫ్‌‌‌‌‌‌‌‌టైమ్ అవార్డ్ ఇస్తున్న సందర్భంలో ఆయన చేసిన ప్రసంగం అంబేద్కర్, పూలే, మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా పట్ల ఆయనకున్న అవగాహనను స్పష్టం చేసింది. అమెరికా లాంటి పాశ్చాత్య సమాజాలు మార్పును అంగీకరించాయని ఆయన అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ పౌరహక్కుల ఉద్యమం తర్వాత అమెరికాలో వచ్చిన మార్పు ఆ విషయాన్ని తెలియజేసింది కూడా. అయితే మన దేశంలో డాక్టర్ అంబేద్కర్ జీవితకాలం పోరాటాలు చేసినప్పటికీ, భారతీయ అగ్రవర్ణాలు మార్పును ఆహ్వానించడానికి ఇప్పటికీ నిరాకరిస్తూనే ఉండటం గమనార్హం.
-ప్రొ. కంచె ఐలయ్య షెపర్డ్