రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రం కుట్ర : ఆర్. కృష్ణయ్య

  • రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు : దేశంలో ఎస్సీ, ఎస్టీ , బీసీ రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. రిజర్వేషన్ల వివాదానికి తెరదించాలంటే చట్టసభల్లో  ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. వివిధ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో లేటరల్ఎంట్రీ పద్ధతి ద్వారా 45 మందిని భర్తీ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమని మండిపడ్డారు. కాచిగూడలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

కులగణన చేస్తామని ప్రధాని ప్రకటించగా.. వెంటనే బీసీ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎర్రోళ్ల  రాఘవేందర్ ను నియమిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో  బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , నేతలు నందగోపాల్, రామకృష్ణ, ఉదయ్ నేత , జిల్లేపల్లి అంజి, పగిళ్ల సతీశ్, నీల వెంకటేశ్ , మట్టా జయంతి పాల్గొన్నారు.