ముషీరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్మెంట్ రూ.4 వేల కోట్లు చెల్లించాలని, పెరిగిన ధరల ప్రకారం విద్యార్థుల స్కాలర్షిప్ ను 5500 నుంచి 10 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు తరగతులు బహిష్కరించి జిల్లా కలెక్టరేట్లు, ఎమ్మార్వో ఆఫీసులను ముట్టడించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ .కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఫీజు బకాయిలు చెల్లించకుంటే నిరవధికంగా బంద్ చేస్తామని తీసుకున్న నిర్ణయాన్ని కాలేజీలు ఉపసంహరించుకోవాలని కోరారు. దీనివలన విద్యార్థుల చదువులు దెబ్బతింటాయని.. కాలేజీ యాజమాన్యాలు ఉద్యమాలకు దిగరాదని సూచించారు.
బీసీ, విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు కాలేజీ యాజమాన్యాలు కోర్సు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు లేక యువత ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెరిగిన ధరలు,విద్యార్థుల కనీస అవసరాలు పరిగణనలోకి తీసుకొని స్కాలర్షిప్ రేట్లు పెంచాలని సోమవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.