బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి : ఆర్. కృష్ణయ్య

బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలి : ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్,వెలుగు: వచ్చే కేంద్ర బడ్జెట్​లో బీసీలకు 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన 14 బీసీ సంఘాల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రం బీసీల అభివృద్ధికి బడ్జెట్ కేటాయించకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. బీసీలకు 2 వేల కోట్లు కేటాయిస్తే ఏ మూలకు సరిపోతుందని ప్రశ్నించారు. 

మండల్​కమిషన్ సిఫారసుల మేరకు కేంద్ర ఉద్యోగాల్లో విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసి 30 ఏండ్లు అయినా ఇప్పటివరకు స్కాలర్ షిప్ లు , ఫీజు రీయింబర్స్ మెంట్ స్కీములు తేకపోవడం బాధాకరమన్నారు. ప్రధాని స్పందించి బీసీల సమస్యలు పరిష్కరించేందుకు అత్యధిక బడ్జెట్ పెట్టాలని కోరారు. లేదంటే దశలవారీగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. సమావేశంలో ఎర్ర సత్యనారాయణ, రాజేందర్, అనంతయ్య, నందగోపాల్, వేముల రామకృష్ణ, పగిళ్ల సతీశ్, రవీందర్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.