కులగణన చేశాకే.. స్థానిక ఎన్నికలు పెట్టాలి: ఆర్ కృష్ణయ్య

కులగణన చేశాకే.. స్థానిక ఎన్నికలు పెట్టాలి: ఆర్ కృష్ణయ్య
  • బీసీ రిజర్వేషన్లను 20 నుంచి 42 శాతానికి పెంచాలి
  • బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు:  కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలనే అంశంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే కుల గణన చేపట్టాలని, బీసీల రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని కోరారు. ఇందుకు న్యాయపరమైన అడ్డంకులు ఏమి లేవని, ప్రభుత్వం తలుచుకుంటే వారం లోపు లెక్కించవచ్చునని పేర్కొన్నారు. 

ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదని, కనీసం సర్పంచులు అయ్యేందుకైనా  చాన్స్ ఇవ్వాలని కోరారు. ఇందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, లేదంటే ఉద్యమిస్తామనిహెచ్చరించారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ , నేతలు గోరిగే మల్లేశ్, రాజేందర్, అంజి, కృష్ణుడు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.