
చెన్నై: దక్షిణ తమిళనాడుకు చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం (RMC) కీలక హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం (మార్చి 11) దక్షిణ తమిళనాడులోని కన్నియాకుమారి, తెన్కాసి, తిరునెల్వేలి, తూత్తుకుడి నాలుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఆర్ఎంసీ తెలిపింది. అలాగే.. రాష్ట్ర రాజధాని చెన్నైకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఆర్ఎంసీ. మంగళవారం చెన్నైలో మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
హిందూ మహాసముద్రం, నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్ప పీడన ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గి ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపింది. శివగంగ, పుదుకోట్టై, రామనాథపురం, తిరువారూరు జిల్లాలో కూడా వాన పడే చాన్స్ ఉందని ఆర్ఎంసీ పేర్కొంది. ఈ తుపాన్ ప్రభావంతో బుధవారం (మార్చి 12) కూడా వివిధ ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ALSO READ | ఏజెంట్స్ మోసం.. అమెరికా వెళ్తున్న ఇద్దరు ఇండియన్స్ కిడ్నాప్.. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నారంటే..?
కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాలో బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. వర్షం, తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించే విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తో్న్నట్లు తెలిసింది. భారీ వర్షం కురిసే సమయంలో.. అలాగే తుపాన్ తీరం టైమ్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.