- కామారెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఆర్ఎంపీ
- మొబైల్ కిట్ తో అవసరమైన వారికి పరీక్షలు చేస్తున్నట్టు గుర్తింపు
- కొందరు ఆర్ ఎంపీలు, దళారులతో కలిసి మూడేండ్లుగా దందా
- రూ. 8 వేల నుంచి రూ. 10 వేల దాకా తీసుకుంటున్నట్టు సమాచారం
కామారెడ్డి, వెలుగు: ఓ ఆర్ఎంపీ లింగ నిర్ధారణ టెస్ట్ లు చేస్తూ దందాకు పాల్పడుతున్నాడు. ఇంట్లోనే స్కానింగ్ మెషీన్ ఏర్పాటు చేసుకున్నాడు. గర్భిణులకు పుట్టబోయేది ఆడ, మగనా అనేది చెబుతున్నాడు. మూడేండ్లుగా ఈ దందా కొనసాగిస్తుండగా.. తాజాగా కామారెడ్డి జిల్లా పోలీసుల దాడితో వెలుగులోకి వచ్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఆర్ఎంపీ రవి గతంలో జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషియన్‌గా పనిచేశాడు. ఆ హాస్పిటల్ లో లింగ నిర్ధారణ టెస్టులు చేస్తున్నారనే సమాచారంతో మూడేండ్ల కింద స్టేట్ హెల్త్ఆఫీసర్లు తనిఖీలు చేసి సీజ్‌చేశారు. అక్కడ లింగ నిర్ధారణ టెస్టులపై రవి అవగాహన పెంచుకున్నాడు.
అనంతరం అతడు హైదరాబాద్‌లో సెకండ్‌హ్యాండ్‌లో స్కానింగ్( అల్ర్టా సోనోగ్రామ్ ) మెషీన్ కొనుగోలు చేసి ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు ఆర్ఎంపీలతో పాటు, మధ్యవర్తుల ద్వారా లింగ నిర్ధారణ పరీక్షలు అవసరమైన దంపతులను పంపుతుండగా వారికి టెస్టులు చేస్తూ.. రూ.8 వేల నుంచి రూ.10వేల చొప్పున తీసుకుంటున్నాడు.
పక్క సమాచారంతో జిల్లా టాస్క్‌ఫోర్స్‌పోలీసులు బుధవారం రాత్రి ఆర్ఎంపీ రవి ఇంటిపై దాడి చేశారు. ఓ జంటకు టెస్టింగ్కోసం పంపి ఆర్ఎంపీని కూడా పట్టుకున్నట్లు తెలిసింది. ఎలాంటి పర్మిషన్లు లేకుండా టెస్టులు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. స్కానింగ్ మెషీన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎంక్వైరీ చేస్తున్నారు.
ఓ టీమ్హైదరాబాద్కు వెళ్లగా.. మరో టీమ్ స్థానికంగా దర్యాప్తు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో మెషీన్ ను ఇతర గ్రామాలకు కూడా తీసుకెళ్లి టెస్టులు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశముంది. ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ హాస్పిటల్లో లింగనిర్ధారణ టెస్టులు చేస్తున్నట్టు తేలడంతో వైద్య, ఆరోగ్య శాఖ ఆఫీసర్లు సీజ్‌చేశారు.
ఇప్పుడు మొబైల్కిట్తో లింగ నిర్ధారణ టెస్టులు చేసే ఆర్ఎంపీ దందా వెలుగుచూడడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.