వికారాబాద్ జిల్లా: పరిగిలోని ఆర్ఎంపి డాక్టర్ గఫార్ యాసిన్ క్లీనిక్ ను జిల్లా వైద్యశాఖ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి అనుమతి, సరైన అర్హత కూడా లేకుండా క్లీనిక్ నడుపుతూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ డాక్టర్ పై వైద్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. మూడు రోజుల క్రితం ఆర్ఎంపి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల శ్రీనివాస్ అనే వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆర్ఎంపి డాక్టర్ పై చర్యలు తీసుకొని క్లీనిక్ మూసివేయాలని పలు ప్రజాసంఘ నాయకులు వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఆర్ఎంపి డాక్టర్ క్లీనిక్ ను తనిఖీ చేసిన జిల్లా వైద్యశాఖ బృందం క్లీనిక్ ను మూసివేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా సరైన అర్హత లేకుండా క్లీనిక్ నడుపుతున్న డాక్టర్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీజ్ చేసినప్పటికి వెనుక డోర్ నుండి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేస్తున్నాడని సమాచారం వచ్చిందని.. దీంతో డాక్టర్ కి జిల్లా వైద్య శాఖ అధికారులు వార్నింగ్ ఇచ్చారు. సరైన అర్హత, ఎలాంటి అనుమతి లేకుండా ఎవరైనా క్లీనిక్ లు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వైద్యశాఖ అధికారులు హెచ్చరించారు.